రాష్ట్రవ్యాప్తంగా ఆసరా సంబరాలు బుధవారం అంబరాన్నంటాయి. అక్కచెల్లెళ్ల మోముల్లో నవ్వుల సిరులు కురిశాయి. పలు చోట్ల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చెక్కులను అట్టహాసంగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా అక్కచెల్లెమ్మలు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. సంక్షేమ రేడుకు మనసారా కృతజ్ఞతలు చెప్పారు. కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆధ్వర్యంలో మహిళలు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. – సాక్షి, నెట్‌వర్క్
అంచెలంచెలుగా ఎదిగారు
ఈ చిత్రంలో ఉన్న ఈమె పేరు వమరవల్లి దుర్గ. ఊరు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం పోలాకి గ్రామం. స్వయం శక్తి సంఘం గ్రూపు లీడర్‌గా ఉన్నారు. ఈమె గ్రూపునకు ఆసరా ద్వారా రూ.4.80 లక్షలు మాఫీ వర్తించింది. ఒక్కో సభ్యురాలికి ఒక్కో విడతలో రూ.12 వేలు మాఫీ నిధులు వచ్చాయి.
ఏటా వచ్చే ఈ నిధులను వ్యాపారానికి వెచ్చించి దుర్గ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. మొదట్లో టీ షాపు పెట్టారు. రెండోసారి నిధులతో బడ్డీకొట్టు పెట్టారు. మూడో సారి నిధులతో ఫినాయిల్ తయారు చేయడం నేర్చుకుని అమ్మకాలు చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే రూ.12 వేలతో జిరాక్స్ మిషన్ కొని వ్యాపారం అభివృద్ధి చేసుకుందామని భావిస్తున్నారు.
ఆసరా ‘భాగ్య’మయ్యే
ఈమె పేరు బట్టా భాగ్యలక్ష్మి. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటకు చెందిన ఈమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నిరుపేద కుటుంబం. భార్యాభర్తలిద్దరూ కూలి పనులకు వెళ్తూ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించుకుంటున్నారు. వైఎస్సార్ ఆసరా ద్వారా ఇప్పటి వరకు రూ.2,46,507 వచ్చింది. దీంతో కూరగాయల వ్యాపారం ప్రారంభించి కూలి పనులకు వెళ్లే బాధల నుంచి విముక్తి పొందారు.
కా‘పాడి’న జగనన్న
ఈమె పేరు పి.ముత్తులక్ష్మి. సూళ్లూరుపేట పట్టణంలోని వట్రపాళెం సమాఖ్య గ్రూపులో సభ్యురాలిగా ఉన్నారు. ఈమెకు వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా రూ.3,15,128 ఇప్పటివరకు వచ్చాయి. ఈ డబ్బులతో మూడు గేదెలను కొనుక్కుని వాటి ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. గతంలో కూలి పనులకు వెళ్లేవారు. ఇప్పుడు ఆ తిప్పలు తప్పాయి. ఇదంతా సీఎం జగన్ చలువ వల్లే సాధ్యమైందని ఆమె తెలిపారు.
పాన్ షాపు పెట్టుకున్నా
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేశారు. మహిళలకు ఆర్థిక ఆసరా కల్పించారు. నాలుగు విడతల్లో వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.30 వేలు వచ్చింది. సున్నా వడ్డీ ద్వారా మరో రూ.50 వేలు రుణం మంజూరైంది. ఈ సొమ్ముతో ఊరిలో పాన్‌షాపు పెట్టుకున్నా. జీవనానికి ఇబ్బంది లేదు. పేదలకు ఆర్థిక భరోసా కల్పించిన ప్రభుత్వానికి అండగా నిలుస్తాం. – జనని, డ్వాక్రా మహిళ, బుడతనాపల్లి గ్రామం, విజయనగరం జిల్లా
మా గ్రూపునకు రూ.8 లక్షలు మాఫీ అయింది
వైఎస్సార్ ఆసరా ద్వారా మా సంఘానికి ఉన్న రూ.8 లక్షల అప్పు మొత్తం తీరిపోయింది. ఒక్కో సభ్యురాలికి రూ.80 వేల వరకు లబ్ధి కలిగింది. రుణమాఫీ, సున్నా వడ్డీ, స్త్రీనిధి, ఉన్నతి తదితర పథకాలతో మహిళలకు ఎంతో మేలు చేశారు. జగనన్నకే మా మద్దతు ఉంటుంది. – వెంకటరమణమ్మ, ప్రశాంతి గ్రామం, శ్రీసత్యసాయి జిల్లా
జగనన్నకు రుణపడి ఉంటాం
మాది పూజిత పొదుపు సంఘం. మా సంఘంలో 13 మంది సభ్యులు ఉన్నారు. వైఎస్సార్ ఆసరా ద్వారా ఒక్కొక్క సభ్యురాలికి రూ.18 వేలు వచ్చింది. ఇప్పటికే గతంలో ప్రభుత్వం జమచేసిన రూ.80 వేల నగదుతో ఇంటి వద్ద చిల్లర దుకాణం పెట్టుకున్నా. ఇప్పుడు జమచేసిన నగదుతో మరిన్ని సరుకులు తెచ్చుకుని విక్రయించి కుటుంబ ఆదాయాన్ని పెంచుకునేందుకు దోహదపడుతుంది. సీఎం వైఎస్ జగనన్నకు, ఈ ప్రభుత్వానికి మా కుటుంబం జీవితాంతం రుణపడి ఉంటుంది. – మాధవి, వికృతమాల, ఏర్పేడు మండలం, తిరుపతి జిల్లా
Comments
Please login to add a commentAdd a comment