
సాక్షి, కాకినాడ: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం నివాసానికి వెళ్లి వైఎస్సార్‌సీపీ నేతలు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం, ముద్రగడ నివాసంలోనే ఆయనతో మిథున్ రెడ్డి, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పెద్దాపురం ఇన్‌ఛార్జ్ దవులూరి దొరబాబు, జగ్గంపేట ఇన్‌ఛార్జ్ తోట నరసింహం భేటీ అయ్యారు.
ఇక, వీరి భేటీ అనంతరం మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ముద్రగడను కలిశాం. ఈ సందర్బంగా ముద్రగడను వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించాం. త్వరలోనే ముద్రగడ మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. కాపు రిజర్వేషన్ల కోసం గొప్ప ఉద్యమం చేసిన నేత ముద్రగడ. ఆఫర్ల కోసం పార్టీలో చేరే వ్యక్తి కాదు. స్వతహాగా ఆయనే పార్టీలో చేరుతారు. సీఎం జగన్‌కు పెద్దలను ఎలా గౌరవించాలో తెలుసు. ముద్రగడకు సముచిత స్థానం ఇస్తారు’ అని కామెంట్స్ చేశారు.