ఐక్యత చాటుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలు
సాక్షి, పుట్టపర్తి: మడకశిర జన సాగరమైంది. బడుగులు భారీ కవాతు చేయగా.. తమకు మేలు చేసిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపేందుకు జన సునామీ తరలివచ్చింది. గుండెల నిండా అభిమానం నింపుకుని ‘జై జగన్’ నినాదాలతో హోరెత్తించింది. నాలుగున్నరేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జరిగిన మేలును వివరించేందుకు వైఎస్సార్‌సీపీ తలపెట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర గురువారం శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో కొనసాగింది.
వైఎస్సార్‌సీపీ రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచన మేరకు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ అధ్యక్షతన స్థానిక వైఎస్సార్ సర్కిల్‌లో నిర్వహించిన సామాజిక సాధికార బస్సుయాత్రలో జనం పోటెత్తారు. అంతకుముందు సరస్వతి విద్యామందిరం ఉన్నత పాఠశాల నుంచి నిర్వహించిన ర్యాలీలోనూ అభిమానులు, కార్యకర్తలు సందడి చేశారు. సభలోనూ బడుగు, బలహీన వర్గాల సామాజిక సాధికారత వెల్లివిరిసింది.
సామాజిక సాధికార బస్సు యాత్రలో వేలాదిగా పాల్గొని వైఎస్ జగన్ అండతో తాము ఎంత ఉన్నతంగా బతుకుతున్నదీ వెల్లడించారు. చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఓటు బ్యాంకుగా వాడుకుని వదిలేయగా.. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నివిధాలా పెద్దపీట వేసి రాజ్యాధికారం కల్పించిన వైనాన్ని పలువురు నేతలు వెల్లడించగా.. సభికుల నుంచి పెద్దఎత్తున హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. బడుగులకు సాధికారత కల్పించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మరోమారు అధికారం కట్టబెడదామని మంత్రులు, నేతలు పిలుపునివ్వడంతో ప్రజలు ఈలలు, కేకలతో మద్దతు ప్రకటించారు.
జగన్‌తోనే సామాజిక సాధికారత: మంత్రి జయరామ్
సీఎం జగన్‌తోనే సామాజిక సాధికారత సాధ్యం అవుతోందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మనూరు జయరామ్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై జగన్ అపారమైన ప్రేమ చూపుతున్నారన్నారు. నాలుగున్నరేళ్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా సుమారు రూ.2.50 లక్షల కోట్లు నేరుగా బ్యాంకు ఖాతాలకు జమ చేసినట్టు వివరించారు. సంక్షేమ పాలన నిరంతరం అందాలంటే 30 ఏళ్లపాటు జగనన్నను సీఎంగా కొనసాగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
జగన్ వచ్చాకే దళితులకు గౌరవం: ఎంపీ నందిగం
జగన్ సీఎం అయ్యాక మంత్రివర్గంలో ఐదుగురికి చోటు కల్పించారని ఎంపీ నందిగం సురేష్ అన్నారు. అందులో ఒకరికి డిప్యూటీ సీఎంతో పాటు మరో మహిళకు హోంశాఖను కట్టబెట్టి గౌరవించారన్నారు.
వైఎస్ కుటుంబం మేలు మరువలేం: ఎమ్మెల్యే తిప్పేస్వామి
మడకశిర నియోజకవర్గానికి వైఎస్ కుటుంబం చేసిన మేలు మరువలేనిదని ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి అన్నారు. జగన్ సీఎం కాగానే.. ఏటా మడకశిరకు కృష్ణా జలాలు అందిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. నేరుగా మడకశిరకు కృష్ణా జలాలు తీసుకురావడానికి బైపాస్ కెనాల్ ఏర్పాటుకు రూ.214 కోట్లు మంజూరు చేశారని పేర్కొన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మంగమ్మ, ఎమ్మెల్యే శంకరనారాయణ, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, వివధ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment