వారిది చిన్న కుటుంబం... చింతలేని కుటుంబం...భార్య, భర్త...ఓ కూతురు. దంపతులిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటారు. ఒక్కగానొక్క కూతురిని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఊరిగాని ఊరు... ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చారు. ఆఫీసు, ఇల్లు తప్ప వేరే ప్రపంచం తెలీదు. ఆ కుటుంబంలోకి ప్రవేశించిన కరోనా మహమ్మారి వారి జీవితాలను చిన్నాభిన్నం చేసింది. కరోనాతో ఆ కుటుంబ యజమాని మృతి చెందగా... కనీసం చివరిచూపునకు కూడా భార్యబిడ్డ నోచుకోలేకపోయారు. ఈ విషాద ఘటన జిల్లా పరిషత్ సీఈఓ శోభా స్వరూపరాణిని పుట్టెడు దుఃఖంలోకి నెట్టింది.
అనంతపురం: ఇటీవల జెడ్పీ కార్యాలయంలో పలువురు ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలో జిల్లా పరిషత్ ప్రాంగణంలోని క్వార్టర్స్‌లో ఉంటున్న సీఈఓ శోభాస్వరూపరాణి కూడా అస్వస్థతకు గురయ్యారు. కరోనా పరీక్ష చేయించుకోగా... రిపోర్ట్ నెగిటివ్ వచ్చింది. సీటీ స్కాన్ చేయించడంతో న్యూమోనియా లక్షణాలు కనిపించాయి. దీంతో వైద్యుల సూచనల మేరకు ఆమె 15 రోజుల క్రితం బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రిలో చేరారు. ఇంటివద్ద హైకోర్టు లాయర్‌గా పనిచేస్తున్న ఆమె భర్త సతీష్ (57), కూతురు ఉన్నారు.
ఐదు రోజుల కిందట సతీష్ అస్వస్థతకు గురికాగా, ఆయన్ను జెడ్పీ ఉద్యోగులే నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ కరోనా పరీక్ష చేయించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అక్కడే కరోనా చికిత్స చేయిస్తూ వచ్చారు. ఆర్డీటీ ఆస్పత్రిలో ఉన్న జెడ్పీ సీఈఓ...తన భర్తను నేరుగా చూడలేని పరిస్థితి. వైద్యులు, ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించిన సిబ్బందితోనే తరచూ ఫోన్ చేసి యోగక్షేమాలు తెలుసుకునేవారు. ఇంట్లో కూతురు ఒక్కతే ఉండగా...ఆందోళన చెందిన శోభాస్వరూపరాణి మూడు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రం వరంగల్‌లోని బంధువుల ఇంటికి బిడ్డను పంపారు.
చివరి చూపునకు నోచుకోని భార్యాబిడ్డ..
నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సతీష్ ఆరోగ్య పరిస్థితి శనివారం రాత్రి విషమించింది. దీంతో ఆయన్ను సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం కన్ను మూశారు. ఇక్కడ వారికి బంధువులెవరూ లేరు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్డీటీలో చికిత్స పొందుతున్న జెడ్పీ సీఈఓకు విషయం చేరవేశారు.
వినకూడని వార్త విని ఆమె స్పృహ కోల్పోయారు. భర్తను కడచూపు చూడలేని పరిస్థితి. వరంగల్‌లో ఉన్న కూతురిని రప్పించలేని దుస్థితి. దీంతో ఆదివారం సాయంత్రం జెడ్పీ ఉద్యోగుల సహకారంతో పెనుకొండ ప్రాంతంలో ఖననం చేశారు. జెడ్పీ సీఈఓను ఓదార్చేందుకు పలువురు అధికారులు, ఉద్యోగులు ఫోన్ చేసినా బోరున విలపిస్తూ మాట్లాడలేని పరిస్థితిరి వెళ్లిపోయారు. కరోనా మహమ్మారి తన ‘శోభ’ను దూరం చేయగా స్వరూపారాణి భర్తను తలచుకుని శోకంలో మునిగిపోయారు.
చదవండి: ఒక్కరోజులో 11,411 మంది రికవరీ
ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల కన్నుమూత
Comments
Please login to add a commentAdd a comment