రహదారుల అభివృద్ధికి వినతి
పీలేరు/కడప సెవెన్‌రోడ్స్: అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లోని రహదారులను అభివృద్ధి చేసేందుకు తక్షణం చర్యలు చేపట్టాలని రాజంపేట, కడప పార్లమెంటు సభ్యులు పీవీ మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరికి వారు వినతిపత్రమిచ్చారు.కడప – రేణిగుంట రోడ్డు విస్తరణ, మదనపల్లెకు బైపాస్ రోడ్డు, పుంగనూరు – పులిచెర్ల – చిన్నగొట్టిగల్లు రోడ్డు అభివృద్ధి, పీలేరు పట్టణంలో దొడ్డిపల్లె మీదుగా సర్వీసు రోడ్డు ఏర్పాటు చేయాలని మిథున్‌రెడ్డి విన్నవించారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. అలాగే జాతీయ రహదారి 716పైన ఉన్న భాకరాపేట నుంచి బద్వేలు (ఎన్‌హెచ్ 67), పోరుమామిళ్ల (ఎన్‌హెచ్ 167)మీదుగా ప్రకాశం జిల్లాలోని బెస్తవారిపేట (ఎన్‌హెచ్ 544డి) వరకు ఉన్న రహదారిని జాతీయ రహదారిగా ఉన్నతీకరించాలని వైఎస్ అవినాష్‌రెడ్డి కోరారు. రేణిగుంట నుంచి ముద్దనూరు వరకు గల ఎన్‌హెచ్ 716 ఎంతో కీలకమైందని తెలిపారు. కోడూరు, రాజంపేట, కడప, కమలాపురం, ఎర్రగుంట్ల, చిలంకూరు ద్వారా ముద్దనూరుకు వెళుతుందన్నారు. ఈ రహదారి వెంట సిమెంటు తదితర పరిశ్ర మలు ఉన్నాయని వివరించారు. ఈ రహదారిపై ట్రాఫిక్ అధికంగా ఉంటుందన్నారు. అందువల్ల కడప నుంచి ముద్దనూరు వరకు ఉన్న రహదారిని ఫోర్‌లేన్ రోడ్డుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కడప నుంచి రేణిగుంట వరకు 130 కిలోమీటర్ల మేర ఉన్న రహదారిని ఫోర్‌లేన్ రోడ్డుగా అభివృద్ధి చేసేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పటికే మంజూరు చేసిందని పేర్కొన్నారు. ఇక మిగిలి ఉన్న ముద్దనూరు–కడప (ఎన్‌హెచ్ 716)ను ఫోర్‌లేన్‌గా అభివృద్ధి చేయాలని కోరారు.
వనిపెంట మీదుగా హైవే విస్తరణ పనులు చేపట్టాలి
ఎన్‌హెచ్ 167 మైదుకూరు నుంచి పోరుమామిళ్ల వెళుతోందన్నారు. గత ఏడాది సర్వే కూడా నిర్వహించారని పేర్కొన్నారు. మైదుకూరు నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో వనిపెంట గ్రామం ఉంటుందన్నారు. ఈ జాతీయ రహదారి వనిపెంట గ్రామం మధ్య నుంచి వెళుతోందన్నారు. ఫలితంగా పలు కుటుంబాలు చిన్నచిన్న షాపులు, దుకాణాలు రహదారికి ఇరువైపులా పెట్టుకుని జీవనోపాధి పొందుతున్నాయన్నారు. ప్రస్తుతం ఉన్నఫళంగా ఈ జాతీయ రహదారిని వనిపెంట గ్రామంలో నుంచి కాకుండా బైపాస్‌లో వెళ్లేలా నిర్ణయించారన్నారు. బైపాస్ రహదారి వల్ల వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతింటాయని పేర్కొన్నారు. పలు గ్రామాల ప్రజలు హైవే నిర్మాణానికి తమ భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ పరిస్థితులను గమనించి గ్రామ ప్రజలు కోరుతున్న విధంగా వనిపెంటలో నుంచే జాతీయ రహదారిని నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.
కడప– రేణిగుంట రోడ్డు విస్తరణ చేపట్టాలి
భాకరాపేట నుంచి బెస్తవారిపేట రోడ్డును జాతీయ రహదారిగా మార్చాలి
కడప–ముద్దనూరు మధ్య నాలుగు లేన్ల రహదారి నిర్మించాలి
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరికి వినతిపత్రమిచ్చిన ఎంపీలు పీవీ మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment