మట్టిని కొల్లగొట్టినా చర్యలేవీ!
ఏపీఎండీసీ అధికారులతీరుపై సర్వత్రా విమర్శలు
ఓబులవారిపల్లె: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అక్రమార్కుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. సెప్టెంబర్ నెల 4వ తేదీన మంగంపేట ఏపీఎండీసీ కార్యాలయ సమీపంలోని పాత అయ్యపురెడ్డిపల్లెలో కూటమి నాయకుల అండతో రాత్రికి రాత్రి ఏపీఎండీసీ ఉద్యోగులు మట్టిని అక్రమంగా తరలించి విక్రయించారు. నేటి వరకు ఏపీఎండీసీ అధికారులు వారిపై చర్యలు తీసుకోలేదు. తాము ఏం చేసినా అడిగేవారు ఎవరూ లేరనే ధోరణిలో ఏపీఎండీసీ ఉద్యోగులు యథేచ్ఛగా వందలాది ట్రిప్పుల మట్టిని టిప్పర్ల సాయంతో తరలించి లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకొన్నారు. కూటమి నాయకుల పలుకుబడి కారణంగా అటు రెవెన్యూ, ఇటు ఏపీఎండీసీ అధికారులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ విషయంపై మంగంపేట ఏపీఎండీసీ సీపీఓ సుదర్శన్‌రెడ్డిని వివరణ కోరగా మట్టిని అనుమతులు లేకుండా తరలించిన విషయం వాస్తవమేనన్నారు. సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ఎండీకి సూచించామన్నారు. అయినా ఇప్పటి వరకు చర్యలు తీసుకున్నట్లు ఎలాంటి సమాచారం అందలేదన్నారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన వారు చిన్న తప్పు చేసినా భూతద్దంలో చూసి అక్రమ కేసులు, చర్యలు తీసుకుంటున్న అధికారులు కూటమి నాయకుల అండదండలతో రెచ్చిపోతున్న ఉద్యోగులపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి మట్టిని అక్రమంగా తరలించి లక్షలాది రూపాయలు కొల్లగొట్టిన ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment