భూ సమస్యలు లేకుండా చేయడమే లక్ష్యం
కలికిరి: జిల్లాలో భూ సమస్యలు లేకుండా చేయడమే రెవెన్యూ సదస్సుల లక్ష్యమని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నారు. మండల పరిధిలోని పారపట్ల గ్రామంలో బుధవారం జరిగిన గ్రామ రెవెన్యూ సదస్సుకు కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీలైనంత వరకు సమస్యలను సదస్సులోనే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. కొన్ని సమస్యలకు నోటీసులిచ్చి పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పారపట్ల గ్రామంలో రీ సర్వేలో భూముల విస్తీర్ణం తక్కువ వచ్చినట్లు అందుతున్న ఫిర్యా దులను త్వరితగతిన పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రైతులు కూడా రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకుని పరిష్కరించుకోవాలన్నారు. పారపట్ల గ్రామానికి చెందిన సుమారు ఇరవై మందికి పైగా రైతులకు పొలాలకు దారి సమస్య దీర్ఘకాలికంగా నెలకొందని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో విచారించిన ఆయన దారికి అవసరమైన భూమిని భూ సేకరణ చేసేందుకు నివేదికను సిద్ధం చేసి పంపాలని తహసీల్దార్ మహేశ్వరిబాయిని ఆదేశించారు. అలాగే గ్రామ పరిధిలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని గేటు ఏర్పాటు చేశారని అందిన ఫిర్యాదు మేరకు ఆక్రమిత స్థలాన్ని స్వయంగా పరిశీలించిన కలెక్టర్ ఆక్రమణలను తొలగించాలని ఆదేశించడంతో సాయంత్రానికే తహసీల్దార్ ఆక్రమణలను తొలగించారు. సదస్సులో రెవెన్యూ సిబ్బంది తీరుపై రైతులు కలెక్టర్‌కు వరుస ఫిర్యాదులు చేశారు.
ఇసుక అక్రమ రవాణాపై కేసు నమోదు చేయండి
పారపట్లలో జరిగిన గ్రామ రెవెన్యూ సదస్సుకు హాజరైన జిల్లా కలెక్టర్ తిరిగి వెళుతుండగా మార్గమధ్యం రంగనాథపురం వద్ద ఇసుక నిల్వను గమనించారు. దీంతో తహసీల్దార్‌ను పిలిచి విచారించారు. ఇసుక అక్రమంగా తరలించే వారిపై కేసు నమోదు చేసి చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘస్వరూప్, మండల ప్రత్యేకాధికారి జయప్రకాష్, మండల సర్వేయర్ రెడ్డెప్ప, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ భువనేశ్వరి, ఎండోమెంట్ అధాకారి మంజుల పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి
Comments
Please login to add a commentAdd a comment