టీడీపీ నాయకుల దౌర్జన్యం
● మామిడి చెట్లు నరికివేత
● అధికారం మాదే..
● అడ్డువస్తే అంతం చేస్తామని బెదిరింపు
ఓబులవారిపల్లె : తెలుగుదేశం పార్టీ నాయకుల దౌర్జన్యానికి అడ్డూ అదుపులేకుండా పోతోంది. అధికారం మాది..మమ్మల్ని అడిగేది ఎవరు.. అడ్డొస్తే అంతం చేస్తామంటూ బొమ్మవరం రెవెన్యూ పరిధిలో పది ఎకరాల మామిడితోటలో చెట్లను నరికి అక్రమంగా తరలించారు. బొమ్మవరం రెవెన్యూ పరిధిలో సర్వే నెంబరు. 937, 938, 939 పట్టా భూమిని 15 సంవత్సరాల క్రితం సుబ్బరాఘవరాజు అనే రైతు నుండి రాజంపేట మండలం, మునక్కాయలపల్లి గ్రామానికి చెందిన పృథ్వీరాజ్ అనే రైతు కొనుగోలు చేశాడు. ఈ ఘటనపై పృథ్వీరాజ్ శనివారం విలేకరులతో మాట్లాడుతూ పట్టా భూమిని చిట్వేలి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగిందని, కొద్దిరోజుల అనంతరం ఎన్ సుబ్బరాఘవరాజు సతీమణి, పిల్లలు తమకు తెలియకుండా భూమి రిజిస్ట్రేషన్ చేయించారన్నారు. మరో వ్యక్తితో చేతులు కలిపి ఆ భూమిలో ఇంకొక భాగం ఉందని వేరొకరికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందన్నారు. అలాగే ముందుకొన్న తనపై రైల్వేకోడూరు కోర్టులో సివిల్ వ్యాజ్యం కూడా వేయించారని, ప్రస్తుతం అధికారం, పలుకుబడి ఉపయోగించి తహసీల్దార్ కార్యాలయంలో నాపేరుపై ఉన్న భూమిని ఆన్‌లైన్‌లో తొలగించారన్నారు. గత బుధవారం నుంచి పది ఎకరాలలో భూ కబ్జాదారుడు దుగ్గిన చంద్రబాబు నాయుడు, గోపాల్ నాయుడు అనే వ్యక్తులు తమ అనుచరులతో కలిసి పది ఎకరాల మామిడి తోటను నరికి వేశారన్నారు. హైదరాబాదులో ఉన్న తాను విషయం తెలుసుకొని పోలీసులకు, తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశామని, కోర్టులో ఉన్న భూమిలో మామిడి చెట్లు నరికి కోర్టు దిక్కారానికి పాల్పడ్డారన్నారు. పొలంలోకి వస్తే అంతం చేస్తామని బెదిరించినట్లు పృథ్వీరాజ్ వాపోయాడు. కబ్జాదారులపై కేసు నమోదు చేసి తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment