అనుమానాస్పద స్థితిలో బీఫార్మసీ విద్యార్థిని మృతి
మదనపల్లె : అనుమానాస్పద స్థితిలో బీఫార్మసీ చదువుతున్న విద్యార్థిని మృతి చెందిన సంఘటన శనివారం మదనపల్లి మండలంలో జరిగింది. సిటియం రోడ్డులోని తట్టివారిపల్లి చెరువులో మృతదేహం తేలియాడడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. తాలూకా సీఐ కళా వెంకటరమణ సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సీఐ తెలిపిన వివరాలిలా... పీలేరు పట్టణం సమీపంలోని బాలంవారిపల్లికి చెందిన ఎం.టి భాస్కర్ కుమార్తె పూజిత (24) మదనపల్లె మండలం, గంగన్నవారిపల్లె లోని కృష్ణచైతన్య నర్సింగ్ కళాశాల లో బీఫార్మసీ మూడవ సంవత్సరం చదువుతోంది. పట్టణంలోని ప్రశాంత్ నగర్ లోని బాలాజీ పీజీ హాస్టల్లో ఉంటూ రోజు కళాశాలకు వెళ్లి వచ్చేది. అనుమానాస్పద స్థితిలో చెరువులో మృతదేహమై కనబడింది. పోలీసుల సమాచారంతో మదనపల్లికు చేరుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు, కుమార్తె మృతికి కారణాలను తాలూకా పోలీసులకు వివరిస్తూ ఫిర్యాదు చేశారు. విద్యార్థిని చిన్నాన్న వెంకటేష్ శుక్రవారం రాత్రి పీలేరు కలకడ మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మతి చెందాడు. శనివారం ఉదయం బాబాయ్ అంత్యక్రియలకు వెళ్లడానికి పూజిత మదనపల్లి నుంచి బయలుదేరింది. విద్యార్థిని చదువుకయ్యే ఖర్చులు భరిస్తూ ఆలనా పాలన చూస్తున్న బాబాయ్ మృతి చెందిన విషయాన్ని జీర్ణించుకోలేక మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. విద్యార్థిని తండ్రి భాస్కర్ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా సీఐ తెలిపారు.
తట్టివారిపల్లె చెరువులో మృతదేహం
Comments
Please login to add a commentAdd a comment