
రామయ్య క్షేత్రానికి రైళ్లేవి?
ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని క్షేత్రంలో ఉన్న రైల్వేస్టేషన్ దుస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఓ వైపు టీటీడీ వార్షిక బ్రహ్మోత్సవాలను కోట్లాది రూపాయిలు వెచ్చించి వైభవంగా నిర్వహిస్తుంటే.. దూర ప్రాంతాలకు చెందిన వారు ఈ వైభవం, ఆలయం ప్రాశ్యస్తంను తెలుసుకునేందుకు రావాలంటే రైలు సౌకర్యం లేదు. టీటీడీ చొరవతో అయినా ఒంటిమిట్ట రైల్వేస్టేషన్ బాగుపడుతుందా అని భక్తులు ఎదురుచూస్తున్నారు.
రాజంపేట: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు భద్రాచలం అధికారిక రామాలయంగా భాసిల్లింది. నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత ఆంధ్రా భద్రాచలంగా ఒంటిమిట్ట కోదండరామాలయం అధికారిక రామాలయంగా ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలను చేపడుతూ వస్తోంది. రెండవ అయోధ్యగా..ఏకశిలానగరంగా పిలవబడుతున్న ఒంటిమిట్ట రైల్వేస్టేషన్‌కు భక్తులు చేరుకునేందుకు రైలే లేదు. ఉన్న ఏ రైలూ ఆగదు. ఏటా ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈయేడాది ఏప్రిల్ 5 నుంచి ఉత్సవాలను వైభవంగా ప్రారంభించేందుకు టీటీడీ సన్నాహాలు చేస్తోంది. కానీ సౌత్ సెంట్రల్ రైల్వే తమ వంతు బాధ్యతగా ఒంటిమిట్టకు భక్తులు చేరుకునేందుకు కల్పించిన రైలు సౌకర్యం శీతకన్ను పెట్టిందనే విమర్శలున్నాయి. ఒంటిమిట్ట రామయ్య చెంతకు చేరుకునేందుకు భక్తులకు వీలులేని పరిస్థితులు దాపురించాయి.
భద్రాచలం తరహాలో స్టేషన్ అభివృద్ధి ఏదీ?
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భద్రాచలం రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేసిన తరహాలోనే ఒంటిమిట్ట రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయాల్సి ఉంది. అయితే దక్షిణ మధ్య రైల్వే శీతకన్ను చూపుతోందనే అపవాదును మూటకట్టుకుంది. ముంబాయి–చైన్నె కారిడార్ రైలుమార్గంలో నడిచే ప్రతి రైలుకు ఒంటిమిట్టలో స్టాపింగ్ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని భక్తులు, ఆధ్యాత్మిక వేత్తలు అంటున్నారు. ప్రస్తుతానికి డెమో ఒక్క రైలు మాత్రం ఉదయం, సాయంత్రం ఆగుతుంది. కోవిడ్ ముందు నడుస్తున్న ఎక్స్‌ప్రెస్ రైళ్లకు స్టాపింగ్ లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఒంటిమిట్టను ఆంధ్రా భద్రాదిగా గుర్తించి, అభివృద్ధి చేస్తుంటే రైల్వేశాఖ తన వంతు పాత్రను పోషించడం లేదు. పల్లె స్టేషన్‌లాగే రైల్వేశాఖ భావిస్తోంది. ఒక సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఒంటిమిట్టను పరిగణనలోకి తీసుకోలేదు. ఒంటిమిట్ట, భద్రాచలం రెండు పుణ్యక్షేత్రాలు దక్షిణ మధ్య రైల్వేలోనే ఉండేది. భద్రాచలం స్టేషన్‌కు ఇస్తున్న ప్రాధాన్యతను ఒంటిమిట్టకు ఇవ్వడం లేదంటే వివక్షను ప్రదర్శించినట్లేనని భక్తులు భావిస్తున్నారు.
రైలు సౌకర్యంపై దృష్టి పెట్టని టీటీడీ ..
ఒంటిమిట్ట రామాలయం టీటీడీలో విలీనమైంది. అయితే ఎంతసేపు రామాలయం అభివృద్ధి వరకు దృష్టి కేంద్రీకరించింది. అయితే రామయ్య క్షేత్రానికి భక్తులు వచ్చేందుకు అవసరమైన సౌకర్యాలపై దృష్టి సారించలేదన్న విమర్శలున్నాయి. ఒంటిమిట్టకు భక్తులు వచ్చేలా రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలని టీటీడీ రైల్వేబోర్డును కోరితే తప్పకుండా స్పందిస్తుందని రైల్వే వర్గాలు చెపుతున్నాయి. ఈవో భక్తులకు రైలు సౌకర్యం కల్పించే విషయంసౌ దృష్టిపెట్టాలని రాష్ట్రంలోని పలు ప్రాంతాల భక్తులు కోరుతున్నారు.
కొత్తజోన్‌లో అయినా..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న ఎస్సీ రైల్వేలో ఏపీకి ప్రత్యేకంగా జోన్ ఏర్పాటైంది. విశాఖజోన్‌కే తలమానికం ఒంటిమిట్ట రామాలయం. అధికారికంగా గుర్తించిన రామాలయం ఇదే. అటువంటప్పుడు కొత్త జోన్ వల్ల రామాలయం ఉన్న ఒంటిమిట్ట స్టేషన్‌కు గుర్తింపు వస్తుందన్న ఆశలున్నాయి.
దూరప్రాంత భక్తులెలా వచ్చేది..
దూర ప్రాంత భక్తులు రైలుమార్గంలో రామయ్య చెంతకు వచ్చేందుకు వీలు లేకుండా పోయింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు ఒంటిమిట్ట రామయ్య దర్శనానికి వస్తున్నారు. భద్రాచలం రోడ్ రైల్వేస్టేషన్ మీదుగా భక్తులు వచ్చేందుకు వీలుగా రైళ్లు నడుస్తున్నాయి. ఒంటిమిట్ట స్టేషన్‌పేరుకు మాత్రమే ఉంది. నవమి బ్రహ్మోత్సవాలు, స్వామివారి కళ్యాణం రోజున లక్ష లాది మంది భక్తులు ఒంటిమిట్టకు చేరుకుంటారు. ఒంటిమిట్ట స్టేషన్ అభివృద్ధి చేయాలంటూ ప్రజాప్రతినిధులు గళం విప్పుతున్నారు. అయినా రైల్వేశాఖలో ఎటువంటి స్పందన కనిపించలేదన్న విమర్శలున్నాయి.
ఒంటిమిట్ట కోదండ రామాలయానికి రైలుమార్గంలో వచ్చేదెలా..?
భద్రాచలం తరహాలోస్టేషన్ అభివృద్ధి ఏదీ?
మొన్నటి వరకు ఒంటిమిట్ట, భద్రాచలం రెండు ఎస్సీ రైల్వేలోనే ..
విశాఖ జోన్‌కే తలమానికంఒంటిమిట్ట రామాలయం
ఒంటిమిట్టపై రైల్వేశాఖ వివక్ష
భక్తులకు రైలు సౌకర్యంపై దృష్టిపెట్టని టీటీడీ
రైల్వే మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళతాం
టీటీడీ ఒంటిమిట్ట కోదండ రామాలయంకు ప్రత్యేక గుర్తింపు ఇస్తోంది. మరి ఎందుకు రైల్వేశాఖ వివక్ష చూపుతోంది. రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి ద్వారా ఒంటిమిట్ట రైల్వేస్టేషన్‌లో రైళ్ల హాల్టింగ్, స్టేషన్ అభివృద్ధి అంశాలను రైల్వే మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళతాం. తెలంగాణాలో ఉన్న భద్రాచలం రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేసి, రైలు సౌకర్యం కల్పించినప్పుడు ఆంధ్రా భద్రాచలం రైల్వేశాఖకు కనిపించలేదా. భక్తులు ఒంటిమిట్టకు చేరుకునేందుకు ఒక్కరైలు కూడా అందుబాటులో లేదు. – తల్లెం భరత్‌రెడ్డి, డీఆర్‌యుసీసీ సభ్యుడు
భక్తుల రాకకు రైలు మార్గమే అనుకూలం
దూరప్రాంతాల నుంచి భక్తులు ఒంటిమిట్టకు చేరుకునేలా రైలు సౌకర్యం కల్పించాలి. భక్తులకు ఏ విధంగా భద్రాచలం రైల్వేస్టేషన్ సౌకర్యంగా ఉందో, అలాగే ఒంటిమిట్టను మార్చాలి. ఏపీకి అధికారిక రామాలయంగా గుర్తించారు. అదే రీతిలో రైల్వేపరంగా భక్తులకు సౌకర్యాల ఏర్పాటుకు కృషిచేయాలి. కనీసం కళ్యాణం రోజైనా స్టాపింగ్ కల్పించాలి. ఎంపీలు పీవీ మిథున్‌రెడ్డి, మేడా రఘునాఽథ్‌రెడ్డిల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళతాం. –తంబెళ్ల వేణుగోపాల్‌రెడ్డి, డీఆర్‌యుసీసీ సభ్యుడు

రామయ్య క్షేత్రానికి రైళ్లేవి?

రామయ్య క్షేత్రానికి రైళ్లేవి?

రామయ్య క్షేత్రానికి రైళ్లేవి?
Comments
Please login to add a commentAdd a comment