అకాల వర్షం.. అపార నష్టం | - | Sakshi
Sakshi News home page

అకాల వర్షం.. అపార నష్టం

Apr 4 2025 12:45 AM | Updated on Apr 4 2025 12:45 AM

అకాల

అకాల వర్షం.. అపార నష్టం

రైల్వేకోడూరు అర్బన్‌: మండలంలోని రైతులు దోస, అరటి, బొప్పాయి, మామిడి పంటలను ధరలు లేక నష్టపోయిన సమయంలో.. గురువారం కురిసిన అకాల వర్షం నట్టేట ముంచింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో వీచిన పెనుగాలులు, భారీ వర్షం 20 నిమిషాల పాటు విలయతాండవం చేశాయి.

ఎక్కడికక్కడ మామిడి, అరటి పంటలు తీవ్ర స్థాయిలో రైతులు నష్టపోయారు. అన్ని రకాల పంటలకు ధరలు లేక ఉన్న కొద్దిపాటి దిగుబడులతో.. జీవనాధార ఖర్చులకు వస్తుందన్న ఆశతో ఉన్న రైతులకు అకాల వర్షం తీవ్ర నష్టానికి గురి చేసింది. కోడూరు మండలంలో అరటి, బొప్పాయి, మామిడి పంటలకు తీవ్ర నష్టాన్ని కల్గించింది. అలాగే అనంతరాజుపేటలో ఆవులకుంట వెంకటేష్‌కు చెందిన రేకుల ఇల్లు, పూరికొట్టం పూర్తిగా కుప్పకూలిపోయింది. అలాగే పలు ప్రాంతాలలో విద్యుత్‌ స్థంభాలు నేలకొరిగాయి. రాఘవరాజుపురంలోని టీడీపీ కార్యాలయం వద్ద బోర్డు కుప్పకూలింది.

చెట్టు విరిగిపడి వ్యక్తికి గాయాలు

గాలివీడు : గాలివీడు మండల పరిధి రాయచోటి–గాలివీడు ప్రధాన రహదారి కరిమిరెడ్డి గారిపల్లె వద్ద గురువారం కురిసిన వర్షం ఈదురుగాలులతో చెట్టు విరిగి కొమ్మలు పడి వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గోరాన్‌ చెరువు గ్రామం వడిశాలంక వాండ్ల పల్లెకు చెందిన ఎం.చెన్నకృష్ణారెడ్డి వ్యవసాయ పనుల మీద మండల కేంద్రానికి వస్తున్న సమయంలో మార్గంమధ్యలో సంఘటన చోటుచేసుకుని వ్యక్తికి తలభాగం, ముక్కుపైన గాయాలతో తీవ్ర రక్తస్రావం అయ్యింది. వెంటనే స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం అందించారు.

పిడుగుపాటుకు ఆవులు మృతి

పెద్దమండ్యం: పిడుగుపాటుతో మూడు పాడి ఆవులు మృతి చెందాయి. మండలంలోని పెద్దమండ్యం పంచాయతీ చెరువుకిందపల్లెకు సమీపంలోని యర్రగొండ వద్ద గురువారం సాయంత్రం ఘటన జరిగింది. చెరువుకిందపల్లెకు చెందిన జి. నాగేశ్వరనాయుడు పాడి ఆవులు, గొర్రెల పోషణతో జీవనం సాగిస్తున్నాడు. పల్లెకు సమీపంలోని యర్రగొండ కింద హంద్రీ–నీవా కాలువ పక్కనే బోరు ఉంది. బోరుకింద పాడి ఆవుల మేత వేసి అక్కడే ఉన్న చింతచెట్టుకింద ఆవులను కట్టేసి మేత వేశారు. సాయంత్రం ఉరుములతో కూడిన చిరుజల్లులు పడ్డాయి. ఉరుములు పెద్ద ఎత్తున వస్తుండడంతో చెంతచెట్టుకింద ఉన్న రైతు నాగేశ్వరనాయుడు భార్య, కుమారుడు సమీపంలోని గొర్రెల దొడ్డి వద్దకు వెళ్లారు. చిరుజల్లులు నిలిచిపోవడంతో పాడి ఆవులను మేతకోసం ఇప్పేందుకు వెళ్లి చూడగా మూడు పాడి ఆవులు పిడుగు పాటుకు గురై మృతిచెందడంతో బోరున విలపించారు. ఘటనపై గ్రామస్తులు రెవెన్యూ, పశుసంవర్ధకశాఖ ఆధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలాన్ని రెవెన్యూ, పశు సంవర్ధకశాఖ అధికారులు పరిశీలించారు. పాడిరైతును ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

నేలకొరిగిన అరటి చెట్లు

లబోదిబోమంటున్న రైతులు

అకాల వర్షం.. అపార నష్టం 1
1/1

అకాల వర్షం.. అపార నష్టం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement