
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
రేకుల షెడ్డు నుంచి పక్కా భవనానికి...
నా భర్త షేక్ అబ్దుల్లా 40 ఏళ్లుగా ఎల్రక్టీషియన్‌గా పని చేస్తున్నారు. రోజులో పని బాగా జరిగితే రూ.500 వచ్చేది. అయితే అది ఇల్లు గడవడానికి, పిల్లల చదువులకు సరిపోయేది కాదు. మేము నంద్యాల పట్టణంలోని వీసీ కాలనీ 34వ వార్డులో 18 సంవత్సరాలుగా రేకుల షెడ్డులోనే నివాసం ఉంటున్నాం. మాకు నలుగురు సంతానం. ఇద్దరు అమ్మాయిలకు పెళ్లిళ్లు చేశాం. పెద్దబ్బాయి డిప్లొమా పూర్తి చేసి ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు.
చిన్న కుమారుడు బీటెక్ చదువుతున్నాడు. నేను ఇంటి దగ్గర గృహిణిగా ఉంటూనే అల్లికల పని చేస్తుంటాను. అయితే నా భర్త, నా ఆదాయం కలిపినా ఇల్లు నిర్మించుకునే స్థోమత లేదు. కొన్నిసార్లు మా ఆయనకు పనులు ఉండవు. అటువంటి సమయంలో ఇల్లు గడవడమే కష్టంగా ఉంటుంది. చిన్న ఇల్లు కావడంతో వర్షాలు పడితే మా కష్టాలు అన్నీఇన్నీ కావు.
పురుగులు, కీటకాలు ఇంట్లోకి వస్తుంటాయి. చాలా భయంగా ఉండేది. ఈ తరుణంలో ప్రభుత్వ పథకాల గురించి తెలిసింది. వలంటీర్ మాకు ఇల్లు కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఆధార్ కార్డు, ఇతర వివరాలతో కూడిన జిరాక్సు కాపీలతో దరఖాస్తు చేసుకున్నాము. ఇల్లు మంజూరైంది. ప్రభుత్వం ఇచ్చిన రూ.1.80 లక్షలకు తోడు మేము కూడబెట్టిన కొద్దిపాటి సొమ్ము, పొదుపు సంఘం ద్వారా కొంత అప్పు తీసుకుని అందంగా ఇల్లు ని ర్మించుకున్నాం. – షేక్ రసూల్‌బీ, వీసీ కాలనీ, నంద్యాల (పీవీ రంగారావు, విలేకరి, నంద్యాల సిటీ)
ప్రజల మనసెరిగిన ప్రభుత్వమిది
అమ్మా నాన్నలు ఆశాబీ, షఫీ రోడ్డుపై వట్టి చేపల వ్యాపారం చేసేవారు. మేము అనంతపురం జిల్లా రాయదుర్గం చౌడమ్మగుడి ప్రాంతంలో ఉంటాము. మాది నిరుపేద కుటుంబం. కొంత కాలం క్రితం నాన్న అనారోగ్యంతో చనిపోయాడు. అమ్మతో కలసి అదే వ్యాపారం కొనసాగించాం. వచ్చే కొద్దో గొప్పో సంపాదనతో ఇంటిని నెట్టుకొచ్చేవాళ్లం.
సరిగ్గా ఏడాది క్రితం నాకు ఉన్నట్టుండి జ్వరం వచ్చింది. చికిత్స చేయించుకున్నా తగ్గలేదు. స్థానిక వైద్యుల సూచన మేరకు రక్త పరీక్షలు చేయించాం. చివరకు వారు హైదరాబాద్ రిఫర్ చేశారు. కిడ్నీలు ఫెయిలైనట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. డయాలసిస్ తప్పనిసరిగా చేయించుకోవాలని చెప్పారు. వారానికి రూ.10 వేల నుంచి రూ.15 వేలు ఖర్చు అవుతుంది. అసలే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. మా బాధను స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డికి చెప్పుకున్నాం.
ఆయన ఉన్నతాధికారులతో మాట్లాడి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా డయాలసిస్ చేయించుకునే ఏర్పాటు చేశారు. అనంతపురం సవేరా ఆస్పత్రిలో వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించుకుంటున్నా. ఆరోగ్యశ్రీ లేకుంటే ఈ పాటికి నా ప్రాణాలు గాల్లో కలిసేవి. దీనికి తోడు ప్రతి నెల రూ.10 వేలు డయాలసిస్ పింఛన్ వస్తోంది. వలంటీరు ఒకటో తేదీ ఉదయమే ఇంటి వద్దకే వచ్చి ఇస్తున్నారు. ప్రజల మనసెరిగిన ప్రభుత్వమిది. కలకాలం ఉండాలి. – నాగబోడి ఇమ్రాన్, రాయదుర్గం (ఈ.రాధాకృష్ణ, విలేకరి, రాయదుర్గం)
50 అడుగుల్లోనే నీరు
ఈ ప్రభుత్వ కృషి కారణంగా భూగర్భ జలాల మట్టం అనూహ్యంగా పెరిగింది. బోరు వేస్తే ఇదివరకు 400–500 అడుగుల్లో నీరు పడేది. ఇప్పుడు హంద్రీ–నీవా ప్రాజెక్టు పుంగనూరు ఉప కాలువకు కృష్ణా జలాలు వదలడంతో 50 అడుగుల్లోనే నీరు వస్తోంది. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం గుంతావారిపల్లె మీదుగా కాలువ సాగుతోంది. ఈ కాలువ వెంబడి పొలాల్లో బోర్లు వేసుకున్నాం.
మాకున్న 12 ఎకరాల పొలంలో మూడు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నా. ఇప్పుడు 8 ఎకరాల్లో డ్రిప్ ద్వారా సాగుకు పొలాలు దుక్కులు దున్ని సిద్ధం చేశాం. హంద్రీ–నీవా కాలువ నీళ్లతో గ్రామంలోని రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతోంది. 50 అడుగుల్లోనే నీరు పడుతోందంటే భూగర్భ జల మట్టం ఏ విధంగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.
హంద్రీ–నీవా కాలువలో కృష్ణా జలాల ప్రవాహంతో మా గ్రామ పరిసరాల్లో నెల రోజులుగా బోరు నీటి అవసరం కలగలేదు. సమీపంలోని బోర్లు, ఎండిపోయిన బావులు, కుంటలు ఇప్పుడు నీళ్లతో కళకళలాడుతున్నాయి. నా పొలం పక్కనే ఉన్న ఎండిపోయిన మంచినీటి బావిలో నీరు ఉబికి వస్తూ నిండుగా ప్రవహిస్తోంది. ఈ నీళ్లు నేరుగా పొలంలోకి వెళ్తున్నాయి. దీనివల్ల బోరుబావి నీటి అవసరం తప్పింది. – బి.చంద్రశేఖర్‌రెడ్డి, గుంతావారిపల్లె (టి.షామీర్ బాషా, విలేకరి, బి.కొత్తకోట)