ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
మా జీవితాలు మారిపోయాయి
మేము ఇద్దరం అన్నదమ్ములం. మా అన్న పేరు పల్లా రాము. విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం గొల్లలపాలెం గ్రామంలో ఒకరికి ఎకరం, మరొకరికి అర ఎకరం పంట భూమి ఉంది. మేము కలిసే వ్యవసాయం చేసుకుంటాం. గతంలో పెట్టుబడి కోసం అప్పులు చేసి వడ్డీతో సహా తిరిగి కట్టేందుకు కూలి పనులకు వెళ్లేవాళ్లం. అయినప్పటికీ అప్పులు తీరక చాలా ఇబ్బందులు పడేవాళ్లం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రావడంతో మా జీవితాలు మారిపోయాయి. జలకళ పథకంలో భాగంగా సుమారు రూ.2 లక్షలు ఖర్చయ్యే బోరు బావిని ఉచితంగా తవ్వంచి మోటారు కూడా పెట్టించారు. నాలుగేళ్లుగా వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద ఇద్దరికీ విడివిడిగా రూ.13,500 వంతున అందిస్తున్నారు. దీంతో అప్పులు చేసే బాధ తప్పింది. బోరు వేశాక ఎకరా పొలంలో వరి సాగు చేస్తున్నాం. అర ఎకరంలో కాయగూరలు, ఆకుకూరలు పండించి తగరపువలస ప్రైవేట్ మార్కెట్‌లో విక్రయిస్తాం.
టీడీపీ హయాంలో రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వలేదు. దీనివల్ల ప్రైవేట్ వ్యాపారుల వద్ద నకిలీ విత్తనాలు, పురుగుల మందులు కొనుక్కుని మోసపోయేవాళ్లం. రైతుల నుంచి అప్పుడు పంటలు కొనుగోలు చేసేవారు కాదు. ఈ ప్రభుత్వం వచ్చాక రైతులకు అందుబాటులో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి సహాయకుల ద్వారా మట్టి, విత్తనాల పరిశీలన, నియోజకవర్గానికో ప్రయోగశాల, పంట కొనుగోలు, విత్తనాలు, ఎరువుల సరఫరా వంటి సౌకర్యాలు కలి్పంచారు. వ్యవసాయాన్ని పండగలా మార్చారు. నా భార్య డ్వాక్రా గ్రూపులో ఉంది. ఆమె మూడేళ్లుగా సున్నా వడ్డీ పథకం కింద లబ్ధి పొందుతోంది. మా అన్న రాముకు పిల్లలు లేరు. నాకు ముగ్గురు పిల్లలు. పెద్దమ్మాయికి వివాహం చేశాము. రెండో అమ్మాయి ఇంటర్ వరకు చదివింది. బాబు 5వ తరగతి చదువుతున్నాడు. నాలుగేళ్లుగా అమ్మఒడి వస్తోంది. – పల్లా సన్యాసిరావు, గొల్లలపాలెం, భీమిలి మండలం (గేదెల శ్రీనివాసరెడ్డి, విలేకరి తగరపువలస, విశాఖపట్నం జిల్లా)
నీడనిచ్చిన మేలు మరువలేను
నాకు భర్త లేడు. కొడుకును కూడా దేవుడు తీసుకెళ్లిపోయాడు. ఆ కేసులో కోడలికి కోర్టు శిక్ష విధించడంతో ఆమె మాకు దూరమైంది. నెలల వయసులో ఉన్న నా మనవడు ఉపేంద్రను తీసుకుని శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం బెలమర పాలవలస గ్రామంలో అద్దె ఇంట్లో ఉండేదాన్ని. వ్యవసాయ కూలి పనులు చేసుకుని అతి కష్టమ్మీద బతుకీడ్చాను. నా కష్టం పగవారికి కూడా రాకూడదని అనుకునేదాన్ని. అలాంటి సమయంలో ఈ ప్రభుత్వం వచ్చింది. నా కొడుకే సీఎం రూపంలో వచ్చినట్టయింది. నేను ఇది కావాలి అని ఎవరినీ అడగలేదు. నవరత్నాల్లో భాగంగా ఇంటి పట్టా ఇచ్చారు.
ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం చేశారు. దాంతో ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నాం. నాకు నీడనిచ్చి నిలబెట్టిన వారి మేలు ఎన్నటికీ మర్చిపోలేను. ప్రతి నెలా ఒకటో తేదీనే మా వలంటీర్ పింఛన్ సొమ్ము పట్టుకుని మా ఇంటికి వచ్చి ఎంతో ఆప్యాయంగా చేతికి అందిస్తోంది. మనవడు ఆరో తరగతి చదువుతున్నాడు. మూడేళ్లుగా అమ్మ ఒడి డబ్బులు కూడా నా ఖాతాలో జమవుతున్నాయి. ఇప్పుడు ఇంటి అద్దె బెడద లేదు. పింఛన్ డబ్బులు, నెలనెలా వచ్చే రేషన్‌తో నా జీవనానికి ఇబ్బంది లేదు. అమ్మ ఒడి డబ్బులతో మనవడిని చదివిస్తున్నాను. వాడిని పెద్ద చదువులు చదివించగలనన్న నమ్మకం కలిగింది. – శిష్టు జయలక్ష్మి, బెలమరపాలవలస, పోలాకి మండలం (చింతు షణ్ముఖరావు, విలేకరి, పోలాకి)
పండుటాకును కాపాడారు
నాకు ఇద్దరు కుమార్తెలు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం గ్రామానికి చెందిన నేను కూలి పనులు చేసుకుని జీవించే దాన్ని. నా ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేశాను. వాళ్లమానాన వాళ్లు బతుకుతున్నారు. ఇప్పుడు నా వయసు 80 ఏళ్లు. ఈ వయసులో ప్రభుత్వం అందించే పెన్షనే పెద్ద ఆధారం. ఈ ప్రభుత్వం వచ్చాక వృద్ధాప్య పింఛన్ రూ.2,750కు పెంచారు. వచ్చే నెల నుంచి మూడు వేలు ఇస్తారని వలంటీర్ చెబుతున్నారు.
గత ప్రభుత్వ హయాంలో వచ్చిన పెన్షన్ డబ్బులు కనీసం మందుల ఖర్చులకు కూడా సరిపోయేవి కాదు. అదీ ఎప్పుడిస్తారో కూడా తెలిసేది కాదు. దానికోసం రోజూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడలా కాకుండా ఒకటో తేదీ ఉదయానికల్లా ఇంటికే వలంటీర్ తెచ్చి డబ్బులు ఇస్తున్నారు. ఎవరి మీదా ఆధార పడకుండా నా నెలవారీ ఖర్చులకు, మందుల ఖర్చులకు జగనన్న ఇచ్చిన పింఛన్ సొమ్ము సరిపోతోంది. నా మనుమరాళ్లకు కూడా అమ్మఒడి పథకం కింద ఏటా రూ.15 వేలు వస్తోంది. అన్ని వర్గాల ప్రజల కష్టాలు తెలుసుకొని ఈ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. – ప్రగడ రత్నం, వృద్ధురాలు, ఏలేశ్వరం (కోరాడ శ్రీనివాసరావు, విలేకరి, ఏలేశ్వరం)
Comments
Please login to add a commentAdd a comment