ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
సర్కారు దయతో పునర్జన్మ
మాది రెక్కాడితే గాని డొక్కాడని బతుకు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాను. గుంటూరు రాజీవ్ గాంధీనగర్‌లో నివసిస్తున్న నాకు నలుగురు పిల్లలు. పెద్దమ్మాయి పెళ్లి చేశాను. నా భార్య చాలాకాలం క్రితమే కన్ను మూసింది. ఇద్దరు కొడుకులు చిన్న చిన్న పనులు చేస్తున్నారు. వారి ఆదాయం అంతంతమాత్రమే.
చిన్నమ్మాయి చదువు పూర్తయి ఇంటి దగ్గరే ఉంటోంది. దీంతో కుటుంబ పోషణ భారమంతా నా పైనే పడింది. రెండేళ్ల క్రితం ఆటో నడుపుతుండగా అకస్మాత్తుగా గుండెల్లో నొప్పి వచ్చింది. మా అబ్బాయి ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. అక్కడ పరీక్షలు నిర్వహించి అత్యవసరంగా బైపాస్ సర్జరీ చేయాలని, లేకుంటే ప్రాణాలకే ముప్పని గుండె పగిలిపోయే వార్త చెప్పారు. సుమారు 3 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. అసలే అంతంత మాత్రం బతుకులు.
ఆ సమయంలో అంత డబ్బు ఎలా అని ఆందోళన చెందా. మాకు తెల్ల రేషన్ కార్డు ఉండడంతో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా ఆపరేషన్ చేస్తారని తెలిసింది. వెంటనే ప్రైవేటు ఆస్పత్రిలో ఆరోగ్యవిుత్రను కలిశాను. వారి సహకారం అందించడంతో ఆపరేషన్ చేసి నాకు పునర్జన్మ ప్రసాదించారు. కొంతకాలం విశ్రాంతి తీసుకున్న తర్వాత యధావిధిగా ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను.
ప్రస్తుతం నేను అద్దె ఇంట్లో ఉంటున్నా. జగనన్న కాలనీలో మాకు స్థలం కూడా కేటాయించారు. అంతేకాకుండా వైఎస్సార్ వాహనమిత్ర కింద రూ. 10 వేలు చొప్పున ఐదు విడతల్లో 50 వేల వరకు లబ్ధి పొందాను. పేదలకు ఈ ప్రభుత్వం అండగా నిలిచింది. నాలాంటివారికి ఎందరికో ప్రాణభిక్ష పెట్టింది.
– రావెల ప్రభాకర్, రాజీవ్‌గాంధీ నగర్, గుంటూరు
(ధూపాటి ప్రకాష్, విలేకరి, నెహ్రూనగర్ (గుంటూరు)
అప్పు చేయకుండా వ్యవసాయం చేస్తున్నా
ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం జగన్నాథపురంలో నాకు రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో ఏటా మిరప పంట సాగు చేస్తాను. ఆ పంట ద్వారా వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తాను. ప్రతి ఏడాది పెట్టుబడులు పెట్టలేక తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొనేవాడిని. ఎరువులు, పురుగుల మందుల కోసం ఊళ్లో ఆందరి దగ్గర అప్పు చేసేవాడిని. పంట పండిన తర్వాత వాటిని అమ్మి అప్పులు చెల్లించేవాడిని.
పంట ద్వారా వచ్చిన డబ్బు దానికే సరిపోయేది. బతకడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చాక ప్రతి సంవత్సరం రైతు భరోసా పథకం ద్వారా రూ.13,500లు నేరుగా నా బ్యాంకు ఖాతాలో జమవుతోంది. ఈ ఏడాది కూడా రైతు భరోసా నిధులు పడ్డాయి. ఆ డబ్బులు నాకు చాలా ఉపయోగపడుతున్నాయి.
పంట వేసే సమయంలో ఎరువులు, దుక్కి, నారు కోసం ఇప్పుడు అప్పు చేయాల్సిన అవసరం రాలేదు. ఆర్‌బీకే ద్వారా విత్తనాలు, ఎరువులు సబ్సిడీ ధరలకు అందాయి. అంతేకాదు నా కుమారుడికి అమ్మ ఒడిలో భాగంగా ప్రతి ఏటా రూ. 15 వేలు అందుతోంది. మా జీవనం సాఫీగా సాగిపోతోంది.
– తంగిరాల ఏసురత్నం, జగన్నాథపురం, తర్లుపాడు మండలం
(రామ యోగయ్య విలేకరి, తర్లుపాడు)
ఉన్నత విద్యకు గొప్ప ప్రోత్సాహం
సాధారణ కుటుంబంలో పుట్టిన నేను ఇంజినీరింగ్ చదువుతానని కలలో కూడా ఊహించలేదు. నేను ఉన్నత విద్య చదువుతున్నానంటే దానికి ఈ ప్రభుత్వమే కారణం. ప్రస్తుతం నేను అవంతి ఇంజినీరింగ్ కాలేజీలో ఇంజినీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్నాను. విశాఖపట్నం నగరం కూర్మన్నపాలెం భరత్‌నగర్‌లో ఉంటున్న మా నాన్న తుమ్మపాల లక్ష్మణ స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్ లేబర్‌గా పనిచేస్తున్నారు. అమ్మ గృహిణి.
కాలేజీ ఫీజు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎంతగానో ఉపయోగపడింది. ఒక్కో సంవత్సరానికి రూ. 49,500లు చొప్పున రెండు సంవత్సరాలకు 99 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఇది కాకుండా రెండేళ్లుగా జగనన్న వసతిదీవెన పథకం ద్వారా రూ.10 వేల చొప్పున మొత్తం 20 వేలు అందింది. దీంతో ఫీజులు కట్టడానికి అవస్థలు తీరాయి.
మా తమ్ముడు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పోయిన ఏడాది వరకు అమ్మ ఒడి డబ్బులు వచ్చాయి. మరిన్ని ఉన్నత చదువులు చదువుకునే వీలు కల్పిస్తున్న ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. కష్టపడి చదివే మాలాంటి పేద విద్యార్దులకు ప్రభుత్వం చేస్తున్న సాయం ఎంతో గొప్పది. గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి సాయం అందక తీవ్ర ఇబ్బందులు పడ్డాం. ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందిస్తున్న పలు సంక్షేమ పధకాల వల్ల హాయిగా బతుకుతున్నాం.
– తుమ్మపాల హేమ, భరత్‌నగర్, కూర్మన్నపాలెం (
పట్నాన కోటిరెడ్డి, విలేకరి, కూర్మన్నపాలెం)
Comments
Please login to add a commentAdd a comment