ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
మేము వ్యవసాయ కూలీలం. నా భర్త నారాయణమూర్తి ఏడేళ్ల కిందటే చనిపోయారు. నాకున్న ఒక్కగానొక్క కూతురు రేవతికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించా. ఇప్పుడు నేనొక్కర్తినే శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం సంతసీతారాంపురం పంచాయతీ చినరావుపల్లిలో వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నా. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ నాలుగేళ్లలో నా ఒక్కదానికే రూ.2,38,209 ప్రభుత్వ సాయం అందింది.
వైఎస్సార్ పింఛన్ కానుక కింద ఇప్పటి వరకు రూ.97,000, వైఎస్సార్ రైతు భరోసాగా రూ.53,500, వైఎస్సార్ ఆసరా (డ్వాక్రా రుణమాఫీ) కింద రూ.28,734, స్వయం సహాయక సంఘం సభ్యురాలిగా ఉన్నందున సున్నా వడ్డీ ప్రయోజనంగా రూ.2,725, వైఎస్సార్ చేయూత పథకం కింద రూ.56,250 అందుకున్నా. ప్రస్తుతం పెరిగిన వితంతు పింఛన్ రూ.3000 అందుకున్నాను. రెక్కాడితేగానీ డొక్కాడని మా జీవితం ఈ రోజు ఇంత ఆనందంగా ఉందంటే కారణం ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలే. ఇలాంటి సంక్షేమాభివృద్ధి పాలన ఎన్నడూ చూడలేదు. ఎప్పటికీ జగనే ముఖ్యమంత్రిగా ఉండాలి.
– కొత్తకోట లక్ష్మి, చినరావుపల్లి (పైడి అప్పలనాయుడు, విలేకరి, ఎచ్చెర్ల క్యాంపస్)
చదువులకు ఆటంకం లేదిక
మాది నిరుపేద కుటుంబం. నా భర్త అబ్బులు పెయింటింగ్ పనులు చేసి కుటుంబపోషణ గావించేవారు. నాకు ఇద్దరు పిల్లలు. బాబు పవన్ రితిక్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండల పరిషత్ నంబర్–1 ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతుండగా, పాప రిబ్‌కాజాయ్ రెండో తరగతి చదువుతోంది. నా భర్త ఓ ప్రమాదంలో గాయపడి మంచానికే పరిమితమయ్యారు. ఇప్పుడు నేనే ఏదో ఒక పనిచేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. పిల్లల చదువు ఎలా అని సతమతమయ్యాం. అదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మా బాబుకు అమ్మ ఒడి కింద ఏటా రూ.15 వేలు వంతున నా బ్యాంకు ఖాతాలో నిధులు జమవుతున్నాయి.
ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం సహా పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో పిల్లలు చదువుకుంటున్నారు. పాఠశాల ప్రారంభం రోజునే జగనన్న విద్యా కానుక ద్వారా ఉచితంగా యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు, షూస్ తదితర సామగ్రి అందిస్తున్నారు. దీనివల్ల పిల్లల చదువుకు చింతలేదు. మా ఆయనకు ప్రతి నెలా పింఛన్ అందుతోంది. అది ఈ నెల నుంచి రూ.3000కు పెంచారు. నాకు డ్వాక్రా రుణమాఫీ సొమ్ము వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా ఇప్పటి వరకు రూ.26 వేలు నా ఖాతాలో జమ అయ్యింది. ఇప్పుడు మా జీవనానికి ఎలాంటి ఇబ్బందులూ లేవు.
– యార్లగడ్డ సౌజన్య, రాయవరం (పి.నాగమణి, విలేకరి, రాయవరం)
ప్రభుత్వమే ఆదుకుంది..
ఒంటరి, దివ్యాంగురాలైన నాకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న వైఎస్సార్ చేయూత, పింఛన్ సొమ్ము ఎంతగానో అండగా నిలుస్తున్నాయి. నాది అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు. కొన్నేళ్ల క్రితం భర్త వదిలేసి వెళ్లిపోయాడు. నా ఏకైక కుమార్తె కూడా పెళ్లి చేసుకొని వెళ్లిపోయింది. కూలి పనులు చేసుకొని ఒంటరిగా జీవిస్తున్న నాకు పుండుమీద కారంలా ఓ ప్రమాదంలో కుడికాలు పూర్తిగా పోయింది. అందువల్ల పనులు చేసుకునే అవకాశం కూడా లేకపోయింది. దివ్యాంగురాలిగా కర్ర సాయంతో జీవిస్తున్న నాకు ఆర్థికంగా ఎలాంటి ఆధారం లేకుండా పోయింది.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక వైఎస్సార్ చేయూత కింద ఏడాదికి రూ.18,750 వంతున మూడేళ్లుగా ఇప్పటికి రూ.56,250 అందింది. గత ప్రభుత్వ హయాంలో దరఖాస్తు చేసినా పింఛన్ మంజూరు కాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే దివ్యాంగ పింఛన్ కూడా మంజూరైంది. నెలనెలా రూ.3 వేలు వస్తోంది. చేయూత, పింఛన్ సొమ్ములతో ఎవరిపైనా ఆధార పడకుండా జీవనం సాగిస్తున్నా. ప్రస్తుతం చిన్న పాత ఇల్లు ఉంది. మాది పోలవరం ముంపు ప్రాంతం కావడంతో అందరికీ వేరే చోట ఇళ్లు కట్టిస్తున్నారు. ఈ ప్రభుత్వమే లేకుంటే నా జీవితం ఏమయ్యేదో.. నా బతుకు ఎలా గడిచేదో తలచుకుంటేనే భయంగా ఉంటుంది.
– కవుజు బేబీ, చింతూరు (మహమ్మద్ షౌఖత్‌అలీ, విలేకరి చింతూరు)
Comments
Please login to add a commentAdd a comment