ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
సచివాలయాలతో ఉద్యోగ విజయం
మాది పెద్ద కుటుంబం. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం బుడ్డేపుపేట పల్లె గ్రామం మాది. ఇద్దరు అన్నయ్యలు, అక్క, తమ్ముడు, అమ్మా, నాన్న అందరం కలసి ఉండేవాళ్లం. కుటుంబాన్నిపోషించాల్సిన నాన్న పాపయ్య మా అందరినీ విడిచి అనంతలోకానికి వెళ్లిపోయారు. కుటుంబ బాధ్యత అమ్మా, అన్నయ్యలపైనే పడింది. అక్కతో పాటు ఇద్దరు అన్నయ్యలకు పెళ్లైంది.
ఇక మిగిలింది నేను. తమ్ముడు. పుట్టినప్పటి నుంచి నా రెండు చేతులు మరుగుజ్జువి కావడంతో బడిలో చాలా మంది నన్ను చూసి జాలి పడేవారు. అది నచ్చని నాకు బాగా చదువుకొని జీవితంలో ఏదో ఒకటి సాధించాలనుకున్నాను. అందుకు మా అమ్మ, అన్నయ్యలు ఎంతగానో ప్రోత్సహించారు. డిగ్రీలో ఉండగానే గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ వేటలో పడ్డాను. ఒక్క ఉద్యోగం కూడా దక్కలేదు. 2018లో డిగ్రీ పూర్తి చేసిన నేను రెండేళ్లలో ఎంఎస్సీ ఆర్గానిక్ పూర్తి చేశాను. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక నాకు రూ.3వేలు వికలాంగుల పింఛన్, మా అమ్మకు వితంతు పింఛన్ మంజూరైంది.
ఈ సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి వేలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. తొలి ప్రయత్నంలోనే నేను 2020 డిసెంబర్ నెలలో వెల్ఫేర్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని సంపాదించాను. ప్రస్తుతం బూర్జపాడు గ్రామ సచివాలయంలో చేస్తున్న ఉద్యోగం ఎంతగానో సంతృప్తినిస్తోంది. ఈ రోజు నేను సమాజంలో దర్జాగా బతుకుతూ, నా కుటుంబ సభ్యులకు చేదోడు, వాదోడుగా ఉన్నానంటే అందుకు ఈ ప్రభుత్వమే కారణం. – ఉప్పిలి విజయలక్ష్మీ, వెల్ఫేర్ అసిస్టెంట్, బూర్జపాడు (మద్దిలి కేశవరావు, విలేకరి, ఇచ్ఛాపురం రూరల్)
సొంతింటి కల నెరవేరింది
పొట్ట కూటి కోసం తమిళనాడు రాష్ట్రం సేలం నుంచి బాపట్ల జిల్లా బల్లికురవ గ్రామానికి వలస వచ్చాం. రెండు దశాబ్దాలుగా ఇక్కడే నివసిస్తున్నాం. నా భర్త వెంకటాచలం రమేష్ గ్రానైట్ క్వారీలో పని చేస్తుండగా... నేను ఓ ప్రైవేటు స్కూల్‌లో పని చేస్తున్నాను. మాకు ఇద్దరు పిల్లలు. మా అబ్బాయి సంజయ్ తమిళనాడులో చదువుకొంటున్నాడు. అమ్మాయి సన్మాది బాపట్లలో బీ ఫార్మసీ విద్యనభ్యసిస్తోంది.
మా ఇద్దరికీ వచ్చే అరకొర సంపాదనతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చాం. ఇంటి అద్దె చెల్లించేందుకు నానా ఇబ్బందులు పడ్డాం. మాకు రేషన్ కార్డు ఉండడంతో గత ప్రభుత్వ హయాంలో అనేక సార్లు ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నా ఎవరూ మా మొర ఆలకించలేదు. కానీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక నవరత్నాల్లో భాగంగా సచివాలయంలో నివేశన స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నాం. దీంతో బల్లికురవ లేఅవుట్‌లో సెంటున్నర స్థలంతో పాటు పక్కా ఇల్లు మంజూరైంది. రూ. 1.80 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది.
దీంతోపాటు డ్వాక్రా బ్రిడ్జి రుణం రూ. 35 వేలు కలిపి అందమైన ఇంటిని నిర్మించుకొని అందులోనే ఆనందంగా జీవిస్తున్నాం. బతుకు తెరువు కోసం వలస వచ్చిన మా లాంటి వారికి కూడా గూడు కల్పించిన ఈ ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. మా అమ్మాయికి తొలుత అమ్మ ఒడి, తరువాత విద్యాదీవెన పథకాల ద్వారా నిధులు మంజూరు కావడంతో అప్పు చేయకుండా ఉన్నత విద్యను చదివించగలుగుతున్నాం. మాలాంటి వారి ఇళ్లల్లో సంతోషాల వెలుగులు పంచుతున్న ముఖ్యమంత్రి మేలు ఎప్పటికీ మరవలేము. – రమేష్ సత్య, బల్లికురవ, బాపట్ల జిల్లా (ఆంజనేయులు, విలేకరి, బల్లికురవ)
నిరుపేదల బతుకుల్లో సంక్షేమ వెలుగులు
మాది సాధారణ కుటుంబం. మా ఆయన ల్యాబ్ టెక్నీషియన్‌గా రెండు చోట్ల పనిచేస్తున్నారు. ఆయనకొచ్చే ఆదాయం అంతంతమాత్రమే. నేను, నా భర్త, పాప, బాబు కలిసి విశాఖ నగరం సీతంపేటలో సొంతింట్లో నివసిస్తున్నాం. నేను డ్వాక్రా సంఘంలో సభ్యురాలిని కావడంతో గతంలో తీసుకున్న రుణమాఫీకి సంబంధించి వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.16 వేలు వచ్చింది.
సున్నా వడ్డీ కింద ఏడాదికి మూడు వేల వంతున ఇప్పటికి మూడు సార్లు జమయ్యింది. మా అబ్బాయికి టెన్త్, ఇంటర్‌లో అమ్మ ఒడి కింద ఏడాదికి రూ.15వేల వంతున మూడేళ్లు అందుకున్నాము. ఆ తర్వాత డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. వాడికి విద్యాదీవెన, వసతిదీవెన అందింది. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం మా లాంటి వారికి ఇన్ని రకాల సంక్షేమ పథకాలు అమలుచెయ్యడం చూడలేదు.
గత ప్రభుత్వంలో మాకు ఎలాంటి పథకాలు అందలేదు. ఇపుడు వలంటీర్ ఇంటికి వచ్చి పలానా పథకానికి మీకు అర్హత ఉంది« దరఖాస్తు చెయ్యమని చెబుతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం చెప్పిన టైమ్‌కు ఠంచన్‌గా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఈ ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. – రెడ్డి కుమారి, సీతంపేట, విశాఖపట్నం (బి.అనితా రాజేష్, రిపోర్టర్, సీతంపేట(విశాఖపట్నం))
Comments
Please login to add a commentAdd a comment