ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
కష్టాలనుంచి గట్టెక్కించిన సర్కారు
నా భర్త శ్రీనివాసులు గృహ నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ నెలకు సుమారు పది వేల రూపాయలు సంపాదించేవారు. నేనూ కూలికి వెళ్లేదాన్ని. నా భర్త ఆదాయానికి నా కూలి డబ్బులు తోడయ్యేవి. ఇలా కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జీ.ఎర్రగుడిలో ఎలాగోలా జీవిస్తున్నాం. హఠాత్తుగా మా బతుకులో పెద్ద ఆపదొచ్చి పడింది. అయిదేళ్ల క్రితం నా భర్త ప్రమాదానికి గురయ్యారు. వెన్నెముక దెబ్బతిని ఏ పని చేయలేకపోతున్నారు. దీంతో కుటుంబ భారమంతా నాపై పడింది. మాకు ఎకరంన్నర పొలం ఉంది. కంది, వేరుశనగ తదితర పంటలు సాగుచేస్తుంటాం.
వర్షాలు కురిస్తేనే పంట చేతికి వస్తుంది. ఏడాదికి సుమారు పది నుంచి 15 వేల రూపాయలు ఆదాయం ఉంటుంది. లేదంటే లేదు. పెద్దకొడుకు కార్తీక్ 10వ తరగతి, చిన్న కొడుకు నవీన్ 8వ తరగతి జొన్నగిరి జెడ్పీ స్కూల్‌లో చదువుతున్నారు. కుటుంబ పెద్ద మంచం పట్టడంతో పిల్లల చదువులు సాగవని బెంగ పెట్టుకున్నాం. ఇలాంటి సమయంలో ప్రభుత్వ పథకాలు మాకు ఎంతగానో ఆదుకున్నాయి. పొదుపు సంఘంలో లింకేజీ కింద రూ.80వేలు, పొదుపు సంఘం నుంచి రూ.50వేలు రుణం తీసుకొని పొట్టేళ్లు కొనుగోలు చేశాను. వైఎస్సార్ ఆసరా కింద రూ.20,400 మాఫీ సొమ్ము బ్యాంకు ఖాతాకు జమ అయింది.
నాకొడుకు చదువుకు అమ్మ ఒడి పథకం ఆధారమైంది. రైతు భరోసా సొమ్ము కూడా అందుతోంది. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా మంజూరైన రూ.18,750తో మరో నాలుగు పొట్టేళ్లు కొనుగోలు చేసి మేపుతున్నా. వీటి వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నా. కష్టాల నుంచి గట్టెక్కించిన ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. – వడ్డే రాజేశ్వరి, జి.ఎర్రగుడి, తుగ్గలి మండలం (కె.రామచంద్రారెడ్డి, విలేకరి, తుగ్గలి)
పెద్ద కొడుకులా ఆదుకున్నారు
మాది కూలి పనులు చేసుకునే నిరుపేద కుటుంబం. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన నేను నా భార్య పనులకు వెళ్తే తప్ప కుటుంబం గడవని పరిస్థితి. మాకు ఇద్దరు పిల్లలు. కుమార్తె శివశంకరమ్మ 20ఏళ్ల క్రితమే అనారోగ్యంతో చనిపోయింది. కుమారుడు గురుశంకర్ బతుకుతెరువు కోసం కువైట్‌కు వెళ్లి, డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మాకున్న ఇల్లు వర్షానికి తడుస్తుండటంతో టార్పాన్లు వేసుకుని కాలం గడుపుతున్నాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మా బతుకులకు భరోసా దక్కింది.
నాకు పింఛన్‌తోపాటు చౌటపల్లె గ్రామం కొత్తపల్లెలో సెంటు భూమిలో పక్కా గృహం మంజూరైంది. నా భార్య లక్ష్మీదేవికి వైఎస్సార్ చేయూత ద్వారా ఏడాదికి రూ.18,750లు వంతున ఇప్పటికి మూడు విడతల్లో రూ.56,250లు అందింది. దీంతో గొర్రెలు, మేకలు కొని కొంత ఉపాధి పొందుతున్నాం. పింఛన్ ఈ నెల నుంచి రూ.3 వేలు చేశారు. జగన్‌బాబు ఇచ్చిన సెంటు స్థలంలో ఇంటి నిర్మాణం చివరి దశకు వచి్చంది. దీన్ని పూర్తిచేసుకుని, మిగిలిన జీవితం ఆనందంగా గడిపేస్తామన్న నమ్మకం పెరిగింది. రోగం వస్తే టౌన్‌కు పోవాల్సిన పనిలేదు.
ఊళ్లోకే డాక్టర్ వస్తున్నారు. జగనన్న ఆరోగ్య సురక్షలో నాకు, నా భార్యకు పరీక్షలు చేసి, మందులు ఉచితంగానే ఇచ్చారు. పెద్ద కొడుకులా సీఎం జగన్ మమ్మల్ని ఆదుకుంటున్నాడు. మళ్లీ జగన్‌బాబే సీఎం కావాలి. – ఉప్పుతోళ్ల గంగయ్య, కొత్తపల్లె, చౌటపల్లె గ్రామం, లక్కిరెడ్డిపల్లె మండలం, అన్నమయ్య జిల్లా (ముప్పాల నరసింహరాజు, విలేకరి, లక్కిరెడ్డిపల్లె)
జగనన్న ప్రభుత్వం అండగా నిలిచింది
మాది రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం అవిడి గ్రామంలో నేను నా భర్త కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్న తరుణంలో విధి వక్రించి మా కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేసింది. సుమారు 20 ఏళ్ల కిందట నేను నాల్గో నెల గర్భిణిగా ఉన్నప్పుడు నా భర్త చనిపోయారు. తరువాత నాకు ఒక ఆడపిల్ల పుట్టింది. కూలిపని చేసుకుంటూ, ఆ పిల్లను కంటికి రెప్పలా పెంచుకుంటూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో జీవనం సాగిస్తూ వచ్చాను.
ఆమెకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించాను. ఒంటరిగా మిగిలిన నాకు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వితంతు పింఛను మంజూరైంది. ఈ ప్రభుత్వం వచ్చాక పింఛను రూ. 3000కు పెరిగింది. వైఎస్సార్ ఆసరా పథకం కింద ఏడాదికి రూ 16 వేలు వంతున ఇప్పటివరకూ అందింది. జగనన్న కాలనీ పథకంలో భాగంగా ఎంతో ఖరీదైన ఇంటి స్థలం ఇచ్చారు. ఇంటి నిర్మాణం కూడా త్వరలో ప్రారంభిస్తామని మా వూరి సర్పంచ్ చెప్పారు. ఏ ఆసరా లేని మాలాంటివారిని ఆదుకుంటున్న జగనన్నకు ఎప్పుడూ రుణపడిఉంటాం. – దాసరి పళ్లాలమ్మ, అవిడ గ్రామం(జగత శ్రీరామచంద్రమూర్తి, విలేకరి, కొత్తపేట)
Comments
Please login to add a commentAdd a comment