ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
ఒంటరి బతుక్కి ఓ గూడు దొరికింది
కుటుంబంలో సమస్యల కారణంగా నేను సుమారు 25 సంవత్సరాల క్రితం మా తాత ఉంటున్న శ్రీకాకుళం జిల్లా ఎల్.ఎన్.పేట మండలంలోని తురకపేట గ్రామానికి వచ్చాను. కుమార్తెకు పెళ్లి చేశాను. కూలి పనులు చేసుకుని జీవిస్తున్నాను. ఊరిలో ఐదారు ఇళ్లు మారాను. నాకు ఇంటి స్థలం లేదు. సొంత ఇల్లు లేదని ఎంతగానో బాధ పడేదాన్ని. స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకునేంత ఆర్థిక స్తోమత లేదు. ఇంటి కోసమే ఎప్పుడూ ఆలోచించేదాన్ని.
ఈ సమయంలోనే గత ఎన్నికల ముందు జగన్‌మోహన్‌రెడ్డి ఇంటి స్థలంతో పాటు ఇల్లు ఇస్తామని మాట ఇచ్చారు. ఆయన గెలిచాక ఇచ్చిన మాట ప్రకారం నాకు ఇంటి స్థలం ఇచ్చారు. ఇల్లు కట్టుకునేందుకు నిధులు మంజూరు చేశారు. సబ్సిడీ ధరలకు నిర్మాణ సామగ్రి అందించారు. వాటికి నేను కూలి చేసుకుని దాచుకున్న డబ్బులు జతచేసి ఇల్లు కట్టుకున్నాను.
మరో నెల రోజుల్లో గృహ ప్రవేశం చేసేందుకు సిద్ధం అవుతున్నాను. ఓ ఇంటికి యజమాని అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఒంటరి మహిళగా గుర్తించిన నాకు ప్రతినెలా పెన్షన్ వస్తోంది. వైఎస్సార్ చేయూత కింద ఏటా రూ.18,750 వంతున వచ్చింది. వైఎస్సార్ ఆసరా కింద మూడు విడతల్లో రూ.11,000 వచ్చింది. ఇప్పుడు నాలుగో విడత కూడా ఇస్తున్నారు. నా జీవనానికి ఇక ఢోకా లేదు. – నానుపాత్రుని జయలక్ష్మి, తురకపేట (సీపాన నాగభూషణరావు, విలేకరి, ఎల్.ఎన్.పేట)
కుటుంబ పోషణకు బెంగ లేదు
మాది రజక కుటుంబం. నేను పదిహేనేళ్లుగా ఇదే వృత్తిలో ఉన్నా. నాకు పదేళ్ల క్రితం పెళ్లయింది. ఇద్దరు కుమారులు. అంతంత మాత్రంగానే వచ్చే ఆదాయం కుటుంబ పోషణకే సరిపోవట్లేదు. పిల్లల చదువులు పెద్ద భారమయ్యాయి. మేము ఎలాగూ చదువుకోలేదు.. పిల్లలనైనా చదివిద్దాం అనే కల కలగానే మిగిలిపోతుందా అని భయపడేవాళ్లం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కల నిజం చేసుకునే అవకాశం వచ్చింది.
మా కుటుంబానికి ఆర్థిక భరోసా లభించింది. జగనన్న చేదోడు పథకం కింద ఏటా రూ.10 వేలు వస్తోంది. విశాఖపట్నం జిల్లా అడవివరంలోని విజినిగిరిపాలెం గ్రామంలోని ఓ పైవ్రేటు పాఠశాలలో పిల్లలను చేర్పించాం. పెద్దోడు రెండో తరగతి, చిన్నోడు ఒకటో తరగతి చదువుతున్నారు. అమ్మ ఒడి పథకంలో నా భార్య ఖాతాలో çఏటా పదిహేను వేలు వంతున పడుతోంది. పిల్లల చదువుకి ఇబ్బంది తొలగిపోయింది.
భవిష్యత్తులో నా పిల్లలు ఉన్నత చదువులు చదువుతారనే నమ్మకం కలుగుతోంది. మాకు ఒక పాత ఇల్లు ఉంది. అందుకే జగనన్న కాలనీ ఇంటికి దరఖాస్తు చేసుకోలేదు. నాలాగే చాలా మంది రజకుల జీవితాల్లో జగనన్న వెలుగులు నింపారు. ఆర్థిక భరోసా కల్పించారు. మళ్లీ ఆయనే సీఎం కావాలని నా ఆకాంక్ష. – ఈగులవలస అప్పలరాజు, సింహాచలం (అవసరాల గోపాలరావు, విలేకరి, సింహాచలం)
కిడ్నీ రోగానికి ఉచిత చికిత్స
చిన్న వయసులోనే దేవుడు అతి పెద్ద కష్టాన్నిచ్చాడు. నా వయసు 29 ఏళ్లు. నాకు ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు. డిగ్రీ వరకు చదువుకున్నాను. అన్నమయ్య జిల్లా మదనపల్లె వీవర్స్ కాలనీకి చెందిన నా భర్త బొమ్మిశెట్టి రవి ప్రైవేట్ కంపెనీలో, నేను మణప్పురం ఫైనాన్స్‌లో పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. గత ఏడాది ఫిబ్రవరిలో ఉన్నట్లుండి నాకు శ్వాస సమస్య తలెత్తింది. ఆస్పత్రికి వెళితే.. వైద్యులు పరీక్షించి పరిస్థితి విషమంగా ఉంది.. పెద్దాస్పత్రికి వెళ్లాలన్నారు.
బెంగళూరు బాప్టిస్ట్ హాస్పిటల్‌కు వెళ్లాం. అక్కడ డాక్టర్లు నా రెండు కిడ్నీలు పాడైపోయాయని, డయాలసిస్ చేయించుకోవాలని చెప్పి, వారం రోజుల తర్వాత డిశ్చార్జ్ చేశారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉండటంతో మదనపల్లెలోని చంద్రమోహన్ నర్సింగ్ హోంలో డయాలసిస్ చేయించుకుంటున్నాను. నా ఆర్థిక పరిస్థితి తెలుసుకుని ఆస్పత్రి వారే డయాలసిస్ పింఛన్‌కు దరఖాస్తు చేయించారు.
నెల వ్యవధిలోనే పింఛన్ మంజూరైంది. గతేడాది ఏప్రిల్ నుంచి ప్రతి నెలా నాకు రూ.10 వేలు వంతున పింఛన్ వస్తోంది. జగనన్న ఇస్తున్న పింఛన్‌తోనే నా ఆరోగ్యానికి అవసరమైన మందులు, వైద్య చికిత్స చేయించుకుంటున్నాను. కిడ్నీ డోనర్ కోసం పోర్టల్‌లో రిజిస్టర్ చేయించాను. కష్టకాలంలో జగనన్న నా ప్రాణాలు కాపాడుతున్నారు. పెద్ద కూతురు యతిక ఒకటో తరగతి చదువుతోంది. అమ్మ ఒడి పథకం కింద రూ.15 వేలు సాయం అందుతోంది. జగనన్న ప్రభుత్వంలో అర్హత ఉన్న వారందరికీ సంక్షేమ ఫలాలు ఇంటి వద్దే అందించడం సంతోషంగా ఉంది. – బొమ్మిశెట్టి వసుంధర, మదనపల్లె (వంశీధర్ సూరమాల, విలేకరి, మదనపల్లె)
Comments
Please login to add a commentAdd a comment