ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
మేము టీడీపీ.. అయినా పథకాలు ఆగలేదు
మాది రాజకీయ కుటుంబం. తెలుగుదేశం పార్టీకి చెందిన నేను 2007 నుంచి 2012 వరకు విజయనగరం జిల్లా గజపతినగరం మండలం కొణిశ సర్పంచ్‌గా పని చేశాను. మా ఆయన సత్యనారాయణ రేషన్‌డీలర్‌గా కొనసాగుతున్నారు. మాకు కొద్దిపాటి వ్యవసాయ భూమి కూడా ఉంది. అందులో పంటలు సాగు చేసుకుంటున్నాం. ఇప్పటికీ మేము టీడీపీ సానుభూతి పరులమే అయినా మాకు అర్హత ఉందంటూ అన్ని ప్రభుత్వ పథకాలూ వర్తింపచేశారు. మా పార్టీ పాలనలో కనీసం ఇల్లు కూడా మంజూరు కాలేదు.
రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ రైతు భరోసా కింద ఏడాదికి రూ.13,500 వంతున వచ్చింది. వైఎస్సార్ ఆసరా కింద నాకు ఇప్పటి వరకు రూ.18,200, మా పాప డిగ్రీ చదివినపుడు విద్యాదీవెన కింద రూ.6,500 వచ్చింది. మాకు ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షల ఆర్థిక సాయం కూడా అందింది. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు మంజూరవుతున్నాయి. పార్టీలకతీతంగా ప్రభుత్వ పథకాలు మంజూరు చేస్తున్నారనడానికి మేమే ఉదాహరణ. – శీరంరెడ్డి లక్ష్మి, కొణిశ (పాండ్రంకి అప్పలనాయుడు, విలేకరి, గజపతినగరం రూరల్)
పది మందికి ఉపాధి కల్పిస్తున్నా..
మాది మధ్య తరగతి కుటుంబం. ఇద్దరు బిడ్డల్ని పోషించుకుంటూ.. వారిని చదివించేందుకు ఎంతో కష్టపడేవాళ్లం. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎగువ రెడ్డివారిపల్లెలో కుటుంబ పోషణ కోసం 2008 నుంచి ఇంట్లోనే మగ్గం నేస్తున్నాం. జగనన్న ప్రభుత్వం వచ్చాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా సమకూరిన సుమారు రూ.8 లక్షల రుణంతో పాటు మరో రూ.2 లక్షలు సమకూర్చుకుని చంద్రగిరిలో శారీ రోలింగ్ సెంటర్ ప్రారంభించా. మొదట విడత ఆసరా డబ్బులతో మరో మగ్గంపై పని ప్రారంభించా. రెండో విడత ఆసరాతో టైలరింగ్, మూడో విడత ఆసరాతో శారీ రోలింగ్ యంత్రాలు ఏర్పాటు చేశా.
నాలుగో విడత ఆసరా డబ్బులతో శారీ బ్లాక్ ప్రింటింగ్, స్క్రీన్ ప్రింటింగ్ ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నా. ప్రస్తుతం విజయవాడ, హైదరాబాద్‌లో మాత్రమే శారీ బ్లాక్ ప్రింటింగ్, స్క్రీన్ ప్రింటింగ్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిని తిరుపతి ప్రజలకు పరిచయం చేసేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నా. ప్రస్తుతం నా వ్యాపారం ద్వారా మరో పది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నా. ఆసరా ద్వారా వచ్చిన రూ.1.04 లక్షలు, డ్వాక్రా రుణం రూ.5.25 లక్షలు, సున్నా వడ్డీ కింద వచ్చిన రూ.20 వేలతో వ్యాపారం అభివృద్ధి చేసుకున్నాం. నా ఇద్దరు పిల్లల చదువులకు జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన అందించారు. వారు డిగ్రీ పూర్తి చేసుకుని, వ్యాపారంలో నాకు చేదోడుగా నిలిచారు. మా జీవితంలో వెలుగులు నింపిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటాం. – ఎస్.మునికుమారి, ఎగువ రెడ్డివారిపల్లి (భూమిరెడ్డి నరేష్ కుమార్, విలేకరి, చంద్రగిరి)
కష్టాల నుంచి గట్టెక్కాం
రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం నాది. నేను లారీ డ్రైవర్‌గా పనిచేసేవాడిని. మేం వైఎస్సార్ జిల్లా చక్రాయపేట మండలం గండికొవ్వూరులో భార్య వెంకటసుబ్బమ్మ, ముగ్గురు ఆడపిల్లలతో ఉంటున్నాం. 2019కి ముందు మాకు ఎలాంటి ప్రభుత్వ సాయం అందలేదు. నేను సంపాదించి తెస్తేనే నాలుగువేళ్లు నోట్లోకెళ్లేవి. ప్రస్తుతం ఆటో నడుపుతూ కుటుంబ పోషణ, పిల్లల చదువులు నెట్టుకొస్తున్నా. జగనన్న ప్రభుత్వం వచ్చాక మా బతుకులు మారాయి. జగనన్న సాయంతో పాటు నేను కూడబెట్టిన సొమ్ముతో పెద్ద కూతురు మనీషకు పెళ్లి చేశా.
రెండో పాప అంజలి డిగ్రీ సెకెండియర్, చిన్నపాప జ్యోత్స్న ఓపెన్ స్కూల్లో ఇంటర్ చదువుతున్నారు. వాహన మిత్ర ద్వారా నాకు ఏటా రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం అందుతోంది. రైతు భరోసా కింద రూ.40 వేలు లబ్ధి కలిగింది. మా పాపకు అమ్మఒడి పథకంలో ఇప్పటి వరకు రూ.30 వేలు అందాయి. రెండో పాపకు విద్యా దీవెన పథకంలో రూ.13 వేలు, వసతి దీవెన కింద రూ.10 వేలు బ్యాంక్ ఖాతాలో జమయింది. నా భార్యకు సున్నా వడ్డీ ద్వారా రూ.10 వేలు లబ్ధి చేకూరింది. జగనన్న కాలనీలో ఇల్లు కూడా మంజూరైంది. అప్పటికే నేను కొత్తగా ఇల్లు కట్టుకుని ఉండటంతో వేరే వారికి ఇవ్వండని మనస్ఫూర్తిగా చెప్పేశా. ఇద్దరు బిడ్డల చదువు జగనన్న ప్రభుత్వమే చూసుకుంటోంది. జగనన్న ఉండగా మాకేం చింతలేదు. ఆయన మేలు ఎప్పటికీ మరచి పోలేం. – గిత్తోళ్ల రామాంజనేయులు, గండికొవ్వూరు (ఇందుకూరు మురళీధర్, విలేకరి, చక్రాయపేట)
Comments
Please login to add a commentAdd a comment