ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
మా అమ్మాయి ఇంజినీర్..
మాది గిరిజన కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడదు. కొండపోడు పనులు, కూలీనాలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేట ఏజెన్సీలో కొండ శిఖరంపైన ఉన్న జన్నోడుగూడ గ్రామానికి చెందిన నాకు ముగ్గురు కుమార్తెలు. వీరిలో ఇద్దరు కుమార్తెలకు చదువంటే చాలా ఇష్టం. స్థానికంగా ఉన్న ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో ఇద్దరినీ ఇంటర్మీడియట్ వరకు చదివించాను.
ఆ పై చదువులు చదివించాలంటే చాలా ఖర్చు అవుతుందని భయపడ్డాను. అయితే పేద కుటుంబాల పిల్లల చదువుకు ప్రభుత్వం సాయం అందిస్తోందని గ్రామంలో చదువుకున్న వారు చెప్పారు. దీంతో పిల్లలను చదివించేందుకు ఏర్పాట్లు చేశాను. సర్కారు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తోంది. హాస్టల్‌లో ఉండి చదువుకునేందుకు జగనన్న వసతిదీవెన పథకం కింద డబ్బు సమకూరుస్తోంది.
పెద్దకుమార్తె విజయ ఏలూరులోని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండియర్ సివిల్ ఇంజినీరింగ్ చదువుతోంది. చిన్నకుమార్తె ప్రశాంతి విశాఖపట్నంలో బీఎస్సీ నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. పైసా ఖర్చు లేదు. ఏటా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు నా భార్య బ్యాంకు ఖాతాలో వేయడంతో కళాశాలకు ఫీజులు కడుతున్నాను. మాలాంటోళ్ల పిల్లలు ఇంజనీరింగ్ చదవడమంటే మాటలా! మా కల నిజమైంది. – సవర బంగారయ్య, జన్నోడుగూడ (బోనుమద్ది కొండలరావు, విలేకరి, సీతంపేట)
పథకాలే మా బంధువులు
భార్యభర్తలిద్దరం కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటూ మా నలుగురు బిడ్డల్ని చదివించుకునేవాళ్లం. రానురాను కూలి పనులు తగ్గిపోయాయి. రాబడి కూడా అంతంతమాత్రంగానే ఉండేది. కూలి చేస్తూ నలుగుర్ని సాకడం కష్టమైపోయింది. అప్పులు పెరిగిపోయాయి. ఏం చేయాలో పాలుపోలేదు. బంధువుల్లో కూడా మాపై చిన్నచూపు ఏర్పడింది.
మాతో మాట్లాడేందుకు, మా ఇంటికి వచ్చేందుకు ఎవరూ పెద్దగా ఇష్టపడేవారు కాదు. ఈ పరిస్థితిలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రావడం.. వైఎస్సార్ ఆసరా, జగనన్న చేయూత పథకాల ద్వారా నాకు లబ్ధి కలిగింది. ఈ మొత్తాలకు శ్రీ నిధి తోడైంది. బ్యాంకు లింకేజీ కింద 1.5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం తీసుకుని, ప్రకాశం జిల్లా తుర్లపాడు మండలం తుమ్మల చెరువులో కిరాణా షాప్ పెట్టుకున్నాము.
నేను, నా భర్త కలిసి దుకాణాన్ని నడుపుతున్నాము. మా చుట్టుపక్కల ఉన్న డ్వాక్రా సంఘాల మహిళలంతా మా దుకాణంలోనే సరుకులు కొంటున్నారు. క్రమంగా మా ఆర్థిక పరిస్థితులు గాడిలో పడ్డాయి. ఇద్దరు కుమారులకు పెళ్లిళ్లు చేశాం. ఈ ప్రభుత్వమే లేకపోయి ఉండుంటే మేము ఏమైపోయేవాళ్లమో! ప్రభుత్వ పథకాలే మా బంధువులయ్యాయి. ఇప్పుడు హాయిగా ఉన్నంతలో సంతోషంగా బతుకుతున్నాం. – షేక్ మహబున్నీ, తుమ్మల చెరువు (రామయోగయ్య, విలేకరి, తుర్లపాడు)
పని కోసం ఇక వలసపోము..
జీవనోపాధి కోసం గతంలో చెన్నై వంటి దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్లం. వైఎస్ జగన్ సీఎం అయిన తరువాత ఆ బాధలు తప్పాయి. మా సొంత ఊరు పార్వతీపురం మన్యం జిల్లాలోని కొత్తపల్లి. నా ఇద్దరు ఆడ పిల్లలను మా అమ్మ దగ్గర ఉంచి నేను, నా భర్త జీవనోపాధి కోసం చెన్నైకి వెళ్లి పనులు చేసుకునే వారం. అయితే కోవిడ్ సమయంలో మా ఊరికి తిరిగొచ్చాం. తరువాత పిల్లలతో సహా విశాఖపట్నం వచ్చాము.
ఇక్కడ అక్కయ్యపాలెం అబిత్‌నగర్‌లో నేను అపార్ట్‌మెంట్‌లో వాచ్ ఉమెన్‌గా ఉంటున్నాను. నా భర్త పోలిశెట్టి తాపీ పనులకు వెళ్తున్నాడు. డిగ్రీ చదువుతుండగానే మా పెద్దమ్మాయికి పెళ్లి చేశాము. రెండో అమ్మాయి మౌనిక అక్కయ్యపాలెం జీవీఎంసీ హైసూ్కలులో తొమ్మిదవ తరగతి చదువుతోంది. ఈ పాపను బాగా చదువించుకోవాలని కోరిక. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవటంతో మా లాంటి పేదలకు ఆ ఆశ నెరవురుతుందా అనే భయం ఉండేది.
ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడా భయం లేదు. వరుసగా నాలుగేళ్లుగా అమ్మ ఒడి డబ్బులు పడ్డాయి. దీంతో మా అమ్మాయికి కావలసినవన్నీ కొనగలుగుతున్నాను. బడికి పంపిస్తే పుస్తకాలు, బూట్లు, బ్యాగు ఇలా అన్నీ ఫ్రీగానే ఇస్తున్నారు. జగనన్న చేస్తున్న సాయం మాలాంటోళ్లకు భరోసాగా నిలుస్తోంది. ధైర్యంగా పిల్లలను చదివిస్తున్నాం. మేము కూలి పనుల కోసం ఎక్కడికీ వలస వెళ్లాల్సిన అవసరం లేదు. – వెంపటాపు లక్ష్మీ, అబిత్‌నగర్, విశాఖపట్నం (కోవెల కాశీ విశ్వనాధం, విలేకరి, విశాఖపట్నం)
Comments
Please login to add a commentAdd a comment