కొల్లూరు: భర్తను కోల్పోయిన భార్య, ఆమె తల్లిదండ్రులపై మృతుడి బంధువులు విచక్షణారహితంగా దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని క్రాపకు చెందిన పట్టాభి అరుణ్‌కుమార్ (28)కు చేబ్రోలు మండలం నారాకోడూరుకు చెందిన మైనరు బాలిక కఠారి వైశాలితో గతేడాది అక్టోబర్ 10న వివాహం జరిగింది. కొద్దిరోజులు సజావుగా సాగిన కాపురంలో అరుణ్‌కుమార్ ఎటువంటి పనిచేయకుండా ఖాళీగా తిరుగుతూ, మద్యం తాగి వచ్చి వేధించడం ప్రారంభించాడు. నెలరోజులు గడిచిన అనంతరం గతేడాది నవంబర్ 10న మృతుడు అరుణ్‌కుమార్ సోదరి భర్త పులివర్తి రవి వైశాలిని ఆమె పుట్టింట్లో వదిలి వచ్చాడు. అరుణ్‌కుమార్ అప్పుడప్పడు భార్య వద్దకు వెళ్లి వస్తుండేవాడు. అత్తమామలు తమ కుమార్తెను కాపురానికి తీసుకెళ్లాలని కోరారు. ఈ క్రమంలో ఈనెల 23న వైశాలి బంధువైన చిలకా కిరణ్, ఇతర పెద్దమనుషుల సమక్షంలో భార్యను కాపురానికి తీసుకెళ్లే విషయంపై అరుణ్‌కుమార్‌తో మాట్లాడేందుకు తెనాలి పిలిపించారు. చర్చల్లో భాగంగా మృతుడు భార్య తరపున వకాల్తా తీసుకున్న పెద్దమనుషులు పద్ధతులు మార్చుకొని భార్యతో సజావుగా కాపురం చేసుకోవాలని మందలించారు. దీనితో తమ పెద్దమనుషులను తీసుకొని వచ్చి అన్నీ మాట్లాడుకొని తన భార్యను కాపురానికి తీసుకువెళ్తానని అక్కడ నుంచి అరుణ్‌కుమార్ వచ్చేశాడు. అదే రోజు అర్ధరాత్రి తెనాలిలో పురుగుమందు తాగి తన స్నేహితుడు అతని భార్య, కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిపాడు. అప్పట్నుంచి తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో ఈనెల 28న గుంటూరు జీజీహెచ్‌కి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అనంతరం మృతుడి బంధువులు మరణానంతరం భార్యతో చేయించే కార్యక్రమాలకు రావాలని పిలవడంతో అతని భార్య, అత్తమామలు క్రాప వెళ్లారు. అరుణ్‌కుమార్ మరణానికి మీరే కారణమంటూ మృతుడి భార్య వైశాలిని, ఆమె తల్లి ధనలక్ష్మిని ఇంటిలోకి తీసుకొని వెళ్లి దాడికి పాల్పడ్డారు. పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మృతుడి బావ పుల్లారావు, తల్లి రాజకుమారి, అరుణ్‌కుమార్ సోదరి శారద, ఆమె భర్త పులివర్తి రవిలు విచక్షణారహితంగా కొడుతూ, గర్భంతో ఉన్న వైశాలి కడుపుపై తొక్కారు. వీరిపై దాడి జరుగుతున్న సమయంలోనే మిగిలిన బంధువులు వైశాలి తండ్రి భూషణంపై మూకుమ్మడి దాడికి దిగారు. దాడిని గమనించిన స్థానికులు వచ్చి అడ్డుపడటంతో అక్కడ నుంచి బయటపడిన బాధితులు ఆటోలో వేమూరు మండలం జంపని వరకు చేరుకొని అక్కడ నుంచి 108 వాహనంలో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లారు. భర్తను కోల్పోయి దాడికి గురైన బాధితురాలు వైశాలి వైద్యశాలలో చికిత్స పొందుతూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ జి.ఏడుకొండలు తెలిపారు.
భార్య, ఆమె తల్లిదండ్రులపై మృతుడి బంధువులు దాడి
స్థానికులు అడ్డుపడడంతో తప్పిన ప్రమాదం
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు
దాడికి పాల్పడిన వారిలో కానిస్టేబుల్
Comments
Please login to add a commentAdd a comment