‘మండలి’ గెలుపు ఎవరిదో ?
సాక్షి ప్రతినిధి, బాపట్ల: కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ సోమవారం గుంటూరు ఏసీ కాలేజీలో జరగనుంది. ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గత నెల 27న పోలింగ్ జరిగింది. జిల్లాలోని బాపట్ల, రేపల్లె, వేమూరు నియోజకవర్గాల పరిధిలో మాత్రమే ఎన్నికలు జరిగాయి. మొత్తం 24,493 మందికి గాను 18,200 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. కూటమి తరఫున ఆలపాటి రాజేంద్రప్రసాద్, పీడీఎఫ్ తరఫున బరిలో నిలిచిన కేఎస్.లక్ష్మణరావుల మధ్యే ప్రధాన పోటీ జరిగింది. ఈ ఎన్నికల్లో మొత్తం 25 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. సోమవారం జరగనున్న ఓట్ల లెక్కింపుతో వీరి భవితవ్యం తేలనుంది. కౌంటింగ్ నేపథ్యంలో కూటమి , పీడీఎఫ్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఓటర్లు, ప్రజల్లో కూడా లెక్కింపుపై మరింత ఆసక్తి నెలకొంది. కూటమి, పీడీఎఫ్ వర్గాలు ఎవరికి వారు గెలుపుపై ధీమాగా ఉన్నారు.
కూటమి నేతల్లో టెన్షన్
పోలింగ్ రోజు కూటమి నేతలు పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని, ప్రధానంగా దొంగ ఓట్లు వేసుకోవడంతోపాటు పలు చోట్ల తమ నాయకులు, ఏజెంట్లపై దాడులు చేసి రిగ్గింగులకు పాల్పడ్డారని పీడీఎఫ్ వర్గాలు ఆరోపించాయి. పలు అక్రమాల నేపథ్యంలో తమ గెలుపు ఖాయమని కూటమి నేతలు పైకి గంభీరంగా చెబుతున్నారు. అయితే, ఉద్యోగులు, నిరుద్యోగుల్లో కూటమి సర్కార్‌పై తొమ్మిది నెలల్లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది ఈ ఎన్నికల్లో మరింతగా ప్రభావం చూపించే అవకాశముందని కూటమి వర్గాలు లోలోపల టెన్షన్‌గానే ఉన్నాయి. పైగా భాగస్వామ్య పక్షాలైన జనసేన, బీజేపీ వర్గాలు కూటమి అభ్యర్థి ఆలపాటిపై వ్యతిరేకతతో ఉన్నాయి. ఇది మరింతగా నష్టం చేసేఅవకాశముందని అంతర్గతంగా చర్చ జరుగుతోంది. మరోవైపు కూటమి ఎన్నిరకాల అక్రమాలకు తెగబడినా ఉద్యోగులు, పట్టభద్రుల ఓట్లతో తాము విజయం సాధిస్తామని పీడీఎఫ్ వర్గాలు ధీమాగా ఉన్నాయి. మొత్తంగా సోమవారం జరగనున్న ఓట్ల లెక్కింపుతో ఎవరు విజయం సాధిస్తారో తేలనుంది.
నేడు ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కూటమి , పీడీఎఫ్ వర్గాల్లో ఉత్కంఠ ఫలితం కోసం ఆసక్తిగా ఎదురుచూపులు జిల్లాలో ఓటుహక్కు వినియోగించుకున్న 18,200 గాడ్యుయేట్స్ ఏర్పాట్లు పూర్తి
Comments
Please login to add a commentAdd a comment