రెండున్నర సవర్ల బంగారం చోరీ
నూతలపాడులో దొంగతనం
పర్చూరు(చినగంజాం): తాళం వేసిన ఇంట్లోకి చొరబడి దుండగులు బంగారాన్ని అపహరించారు. ఈఘటన మండలంలోని నూతలపాడు ఎస్సీ కాలనీలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఎస్సీకాలనీకి చెందిన నూకతోటి బెంజిమన్ నూతలపాడు సెంటర్‌లో నూడిల్స్ బండితో వ్యాపారం చేసుకుంటూ జీవనం చేస్తుంటాడు. మధ్యాహ్నం సెంటర్‌కు వెళితే తిరిగి రాత్రి 11 గంటలకు మాత్రమే ఇంటికి తిరిగి వస్తుంటాడు. సోమవారం ఎప్పటి లాగానే ఇంటికి తాళాలు వేసి బండి దగ్గరికి వెళ్లాడు. రాత్రి ఇంటికి వెళ్లిన సమయానికి తలుపులు తెరచి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలోని వస్తువులు చిందరవందరగా పడేసి కన్పించాయి. బీరువాలోని బంగారం వస్తువులు కనిపించకపోవడంతో ఒక్కసారిగా బిత్తరపోయాడు. రెండున్నర సవర్ల బంగారం దొంగతనానికి గురైందని గ్రహించాడు. దాంతో అతడు పర్చూరు పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ మాల్యాద్రి ఇంటి పరిసరాలను పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఎదురెదురుగా బైకుల ఢీ
నలుగురికి గాయాలు
కారంచేడు: ఎదురెదురుగా వేగంగా రెండు ద్విచక్రవాహనాలు ఢీకొట్టుకోవడంతో నలుగురికి గాయాలయ్యాయి. ఈఘటన మంగళవారం వాడరేవు–పిడుగురాళ్ల ప్రధాన రహదారిలో కారంచేడు యార్లగడ్డ నాయుడమ్మ ఉన్నత పాఠశాల సమీపంలోని ఆదిపూడి రోడ్డు వద్ద జరిగింది. ఎస్సై వీ వెంకట్రావు వివరాల మేరకు.. చీరాల జాండ్రపేటకు చెందిన ఇద్దరు వ్యక్తులు అవిశాయిపాలెం వెళ్లి చేతికి అయిన గాయంకు కట్టుకట్టించుకొని తిరిగి చీరాలకు ద్విచక్రవాహనంపై వస్తున్నారు. ఈ క్రమంలో జాగర్లమూడికి చెందిన ఇద్దరు వ్యక్తులు వ్యక్తిగత పనులపై చీరాల వచ్చి తిరిగి జాగర్లమూడి వెళ్తున్నారు. రెండు వాహనాలు ఎదురెదురెదుగా వేగంగా వస్తూ అదుపుతప్పి ఢీకొన్నాయి. దీంతో వాహనంపై ఉన్న ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కారంచేడు ఏఎస్‌ఐలు బీ శేషసాయి, మధుబాబులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారి సహకారంతో 108 వాహనంలో చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వివరాలు నమోదు చేశారు. పూర్తి వివరాలు వచ్చిన తరువాత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య
పర్చూరు (చినగంజాం): మండలంలోని రమణాయపాలెం గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఎన్నిరెడ్డి శ్రీనివాసరెడ్డి (34) ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి బంధువుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఆయన తన భార్య వాసవితో కలిసి నివాసముంటున్నాడు. వారికి ఒకటిన్నర ఏడాది వయసు కలిగిన పాప కూడా ఉంది. ప్రస్తుతం భార్య గర్భిణి కావడంతో నెల రోజుల కిందట నూతలపాడు గ్రామంలోని తన పుట్టింటికి వచ్చి ఉంటోంది. దాంతో అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా ఉంటున్న శ్రీనివాసరెడ్డి తాను నివాసముంటున్న అపార్ట్‌మెంట్‌లో ఉరివేసుకొని మృతి చెందినట్లు మంగళవారం కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందింది. హైదరాబాద్‌లో పోస్టుమార్టుం అనంతరం మృతదేహాన్ని బుధవారం గ్రామానికి తీసుకురానున్నట్లు బంధువులు తెలిపారు. అతని మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.
రెండున్నర సవర్ల బంగారం చోరీ
రెండున్నర సవర్ల బంగారం చోరీ
Comments
Please login to add a commentAdd a comment