మద్యం మత్తులో వ్యక్తిపై కత్తితో దాడి
మార్టూరు: మద్యం మత్తులో ఓ వ్యక్తిపై మరో వ్యక్తి కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈఘటన మండలంలోని ద్రోణాదుల గ్రామంలో మంగళవారం జరిగింది. అందిన వివరాల మేరకు.. గ్రామంలోని ప్రభుత్వ వైన్స్ షాప్ ఎదురుగా గల బాషా రెస్టారెంట్ పేరుతో ఓ మహిళ బెల్ట్ షాపు నిర్వహిస్తోంది. అదే గ్రామానికి చెందిన ముప్పరాజు చిన్నా, షేక్ జాన్ అనే ఇద్దరు వ్యక్తులు రెస్టారెంట్‌లో కూర్చుని మద్యం తాగుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రారంభమైన స్వల్ప వివాదం పెరిగి ఘర్షణకు దారితీసింది. మద్యం మత్తులో క్షణికావేశానికి గురైన జాన్ రెస్టారెంట్లో ఉన్న కత్తి తీసుకొని మొదట చిన్నాను కాలితో బలంగా తన్నాడు. ఆ ధాటికి చిన్నా రెస్టారెంట్ బయట గల బురదలో పడగా జాన్ చిన్నా వెంటపడి కత్తితో తలపై బలంగా దాడి చేయడంతో గాయమైంది. జాన్ అంతటితో ఆగక చిన్నా మెడపై కత్తి పెట్టి కోసే ప్రయత్నం చేశాడు. అప్పటి వరకు ఈ తతంగాన్ని గమనిస్తున్న స్థానికులు ఒక్కసారిగా అప్రమత్తమై జాన్‌ను చుట్టిముట్టి అతని చేతిలోని కత్తిని బలవంతంగా లాక్కొని విడిపించారు. అనంతరం జాన్‌కు దేహశుద్ధి చేసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు జాన్‌ను అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్‌కు తరలించారు. బాధితుడు చిన్నాను చికిత్స నిమిత్తం మార్టూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా కోలలపూడి గ్రామానికి చెందిన 8 మంది యువకులు జొన్నతాళి సెంటర్‌లోని సూర్య దాబా నిర్వాహకులు ముగ్గురిపై మద్యం మత్తులో బీరు సీసాతో కొట్టి ధ్వంసం చేసి వారం రోజులు కూడా గడవక ముందే ద్రోణాదులలో ఈ ఘటన జరగటం మండలంలో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది.
గొంతుకోసే యత్నం చేసిన దుండగుడు అడ్డుకుని దేహశుద్ది చేసిన స్థానికులు ద్రోణాదుల బెల్ట్ షాపులో ఘటన
మద్యం మత్తులో వ్యక్తిపై కత్తితో దాడి
Comments
Please login to add a commentAdd a comment