మద్దిపాడు: ఆయిల్ దొంగల ఆట కట్టించారు పోలీసులు. మద్దిపాడు సమీపంలో ఉన్న లారీ యూనియన్ ఆఫీస్ వద్ద ఇటీవల ఆయిల్ దొంగతనం చేసిన కేసులో దొంగలు పట్టుబడ్డారు. ఎస్సై శివరామయ్య వివరాల మేరకు.. పల్నాడు జిల్లా వినుకొండ నెహ్రునగర్ తండాకు చెందిన మీరాజాత్ కళ్యాణ్ నాయక్, మీరాజాత్ ప్రేమ్కుమార్, వినుకొండ పట్టణానికి చెందిన తాడి అమరలింగేశ్వరరావు గత నెల 25వ తేదీ అర్ధరాత్రి సమయంలో లారీ యూనియన్ ఆఫీస్ వద్ద ఆయిల్ దొంగతనం చేశారు. దీనిపై లారీ యూనియన్ నాయకులు పోలీసులు ఫిర్యాదు చేశారు. జాతీయ రహదారిపై పలుచోట్ల లారీల నుంచి ఆయిల్ దొంగతనం చేస్తున్నారన్న ఫిర్యాదులు రావడంతో ఎస్పీ దామోదర్ నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. మద్దిపాడు ఎస్సై, కానిస్టేబుల్ సురేష్, హోంగార్డు శేఖర్‌లు గురువారం ఉదయం 8 గంటల సమయంలో బీట్ నిర్వహిస్తుండగా కొష్టాలు సెంటర్ సమీపంలో జాతీయ రహదారి పక్కన ఆపిన లారీ వెనుక భాగంలో అనుమానాస్పదంగా ఒక బొలెరో వాహనం కనిపించింది. పోలీసులు వారిని పట్టుకొని ప్రశ్నించగా ఆయిల్ దొంగతనం చేస్తున్నట్లు అంగీకరించారని ఎస్‌ఐ తెలిపారు. ఈ నేపథ్యంలో వాహనాన్ని సీజ్ చేసి, ముగ్గురిని అదుపులోకి తీసుకొని స్పెషల్ మొబైల్ కోర్టుకు హాజరు పరిచినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment