పవిత్ర మాసంలో శుభాల శుక్రవారం
యడ్లపాడు: ముస్లిం సమాజానికి జుమ్మా(శుక్రవారం) పవిత్రమైన ప్రత్యేక రోజు. సూర్యుడు ఉదయించే రోజుల్లో అన్నింటికంటే ఉత్తమమైన రోజుగా జుమ్మాను పరిగణిస్తారు. ఇస్లాంలో ప్రధానంగా రంజాన్, బక్రీద్ అనే రెండు పండుగలు ఉన్నప్పటికీ, వారంలో ఒకరోజైన జుమ్మాను ప్రత్యేక పండుగ రోజులా పరిగణిస్తారు. రంజాన్ మాసంలో ఇది మరింత విశిష్టతను సంతరించుకుంటుంది. ముఖ్యంగా చివరి జుమ్మా విశేష ఫలప్రదమైనదిగా భావిస్తారు. ఖురాన్‌లోని సూరా ‘అల్–జుమ్మా‘లో శుక్రవారం విశిష్టత వివరించబడింది. జుమ్మా రోజున ముస్లింలు తమ పనులను విడిచి మసీదులకు వెళ్లి ప్రాపంచిక విషయాలను పక్కన పెట్టి దైవచింతనతో ప్రార్థనలు చేయాలని స్పష్టంగా పేర్కొనబడింది. ఇస్లామిక్ గ్రంథాల ప్రకారం, తీర్పుదినం రోజు యూదులు, క్రైస్తవుల కంటే ముందుగా ముస్లింలు దైవ విచారణను ఎదుర్కొంటారని ప్రవక్త మొహమ్మద్ (సఅసం) తెలియజేశారు. మానవజాతి మొదటి వ్యక్తి అయిన ఆదాము(అ)ను దైవం సృష్టించబడిన రోజు శుక్రవారం. అతను స్వర్గానికి పంపించబడినదీ శుక్రవారమే. అనంతరం నిషేధిత ఫలం తిన్నరోజు.. ఆదాం అవ్వాలను తిరిగి భూమికి తరిమివేయబడినదీ ఆ రోజే. తమ తప్పును గ్రహించి అల్లాహ్‌ను క్షమాభిక్ష కోరిన రోజు కూడా శుక్రవారం కావడం విశేషం. తొలి మానవుడు ఆదాం మరణించినది ఇదే రోజు. తీర్పు దినం (ఖయామత్) కూడా శుక్రవారం జరిగే రోజు అని ప్రవక్త ముహమ్మద్ (సఅసం) తెలియజేశారు. శుక్రవారం 15 సున్నతులు పాటించాల్సి ఉంటుంది. ఇస్లాంలో జుమ్మా రోజుకు, జుమ్మా జోహర్ నమాజుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అల్లాహ్ ఆదేశానుసారం ప్రవక్త ఆచరించి చూపిన వాటిలో జుమ్మా నమాజు ఒకటి. పవిత్రమైన ఆ రోజున అల్లాహ్ ఆరాధనలో గడపాలని అల్లాహ్ యొక్క హుజూర్, ఉమ్మత్తులు అందరికీ నిశ్చయించారు. ఖురాన్, హుజూర్ నుంచి ఎన్నో హదీసుల ద్వారా సందేశాలను తెలియజేశారు.
నేడు రంజాన్ మాసం తొలి శుక్రవారం ఇస్లాంలో జుమ్మా ఎంతో ప్రత్యేకం
ఎంతో పుణ్యఫలం
జుమ్మా నాడు మసీదుకు నడిచి వెళ్లిన వారి ఒక్కొక్క అడుగుకి ఒక్కో పాపం తొలగి, వారి దర్జా స్వర్గంలో హెచ్చించబడుతుంది. ఎవరైతే మసీదు లోపలికి మొదటిగా ప్రవేశిస్తారో వారికి దేవదూతలు ఒక ఒంటెను త్యాగం చేసినంత పుణ్యాన్ని లిఖిస్తారు. ప్రవేశించిన రెండో వ్యక్తికి ఆవు, మూడో వ్యక్తికి మేకను, నాలుగో అతనికి కోడి, ఐదో వ్యక్తికి గుడ్డుకు సమానంగా పుణ్యమును వారి ఖాతాల్లో దేవదూతలు రాయడం జరుగుతుంది. జుమ్మా నమాజ్‌తోపాటు అల్ కహాఫ్ సూరా చదివి, శ్రద్ధగా బయాన్ విన్నవారికి జుమ్మా నుంచి జుమ్మా వరకు చేసిన పాపములు అల్లాహ్ క్షమిస్తాడు. జుమ్మారోజు సూరా అల్ దుఖాన్ ఎవరైతే చదువుతారో వారికోసం 70 వేల దేవదూతలు దువా చేస్తారు. ఇలా జుమ్మాను పవిత్రంగా భావించి ఆరాధన చేసిన వారికి అల్లాహ్ ఒక సంవత్సరం అంతా ఒక్కపొద్దు, ప్రార్థనలు చేసినంత పుణ్యమును బహుమతిగా ఇస్తారు. అలాగే జుమ్మా రోజు చనిపోయిన వారికి అల్లాహ్ సమాధి శిక్షల నుంచి తొలగిస్తాడు.
– షేక్ అబ్దుల్ కలీం, మత గురువు
పవిత్ర మాసంలో శుభాల శుక్రవారం
Comments
Please login to add a commentAdd a comment