మోటుపల్లి ప్రాశస్త్యాన్ని వెలుగులోకి తీసుకురావాలి
బాపట్ల: మోటుపల్లి ప్రాచీన ప్రాశస్త్యాన్ని వెలుగులోకి తెస్తూ పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. మోటుపల్లి గ్రామం, మ్యూజియం నిర్మాణం, వీరభద్రస్వామి దేవస్థానం అభివృద్ధి కమిటీ సమావేశం స్థానిక కలెక్టర్ చాంబర్‌లో శుక్రవారం నిర్వహించారు. కాకతీయులనాటి అభయ శాసనాలను తెలుగులోకి అనువదిస్తున్నామని కలెక్టర్ చెప్పారు. ఇప్పటికే పురావస్తు శాఖ పరిశోధకులు, శాసనాల పరిశోధకుల ద్వారా ఆ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ప్రాచీన వైభవం తెచ్చేలా కోదందరామ ఆలయం అభివృద్ధి చేస్తామన్నారు. కోదండరామ దేవాలయానికి సమీపంలోని 5.8 ఎకరాల భూమిని ఆలయానికి కేటాయించాలన్నారు. ఆ భూమికి సంబంధించిన దస్త్రాలు, వివరాలను సీసీఎల్‌ఏకు నివేదించాలన్నారు. చినగంజాం మండలంలోని ఆ గ్రామంలో తుపాను షెల్టర్ ఎదురుగా ఉన్న 4.5 ఎకరాల ఖాళీ భూమిని విచారించాలన్నారు. సమీపంలోని 10.9 ఎకరాల భూమిని కోదండరామ స్వామి దేవాలయానికి కేటాయించే అంశంపై దృష్టి సారించాలన్నారు. 100 ఎకరాల పరిధిలోని బయోడైవర్సిటీ భూమిని పరిశీలించాలన్నారు. కాకతీయులు, చోళరాజుల నాటి శాసనాలు, పంచలోహాలను చిన్నగంజాంలోనే భద్రపరచడానికి మ్యూజియం నిర్మించాల్సి ఉందని కలెక్టర్ తెలిపారు. మ్యూజియం నిర్మాణంపై పురావస్తు శాఖకు సమగ్ర నివేదికతోపాటు లేఖ పంపాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతానికి చెందిన ప్రాచీన సంపద ప్రస్తుతం హైదరాబాద్, చైన్నె, విజయవాడ మ్యూజియంలలో ఉందన్నారు. వాటిని తెప్పించడానికి దస్త్రాలను సిద్ధం చేయాలన్నారు. ప్రాచీన కాలం నాటి బుద్ధుడి విగ్రహాన్ని భద్రపరిచేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మార్గనిర్దేశం చేశారు. డీఆర్వో జి గంగాధర్‌గౌడ్, చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్, దేవదాయ శాఖ సహాయ కమిషనర్ సూర్యప్రకాశరావు, శాసనాల పరిశోధకులు డాక్టర్ బి రమేష్‌చంద్రబాబు, ఫోరం ఫర్ బెటర్ బాపట్ల సంస్థ అధ్యక్షులు డాక్టర్ సాయిబాబు పాల్గొన్నారు.
గురుకుల పాఠశాలలో మౌలిక వసతి కల్పించాలి
డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. నర్సాయపాలెంలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాల అభివృద్ధిపై అనుబంధ శాఖల అధికారులతో శుక్రవారం ఆయన స్థానిక కలెక్టర్ చాంబర్‌లో సమావేశం నిర్వహించారు. యుద్ధ ప్రాతిపదికన రూ.3.5 లక్షలతో ఆర్‌ఓ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్నారు. 24 మరుగుదొడ్లు నిర్మించేలా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌కు దస్త్రం పంపాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా పాఠశాలకు వంటగది, విద్యార్థుల కొరకు భోజనశాల ఏర్పాటు చేయాలన్నారు. క్రీడా మైదానాన్ని చదును చేయడానికి స్వచ్ఛంద సంస్థలు, దాతల సహకారం తీసుకోవాలన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ అనంతరాజు, సమగ్ర శిక్ష అభియాన్ ఏపీసీ నాగిరెడ్డి, పంచాయతీరాజ్ ఇన్‌చార్జి ఎస్‌ఈ గౌడిపేరి రతన్ బాబు, పాఠశాల ప్రధానాచార్యులు పాల్గొన్నారు.
జనరిక్ మెడికల్ షాపుపై ప్రజల్లో అపోహలు వద్దు
జనరిక్ మెడికల్ షాపులపై ప్రజలకు ఉన్న అపోహలను తొలగించుకోవాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక టీచర్స్ కాలనీలో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ పరియోజన మందుల షాపును కలెక్టర్ ప్రారంభించారు. బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సలగల రాజశేఖర్‌బాబు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ ఉన్నారు.
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి
పక్కా గృహాల నిర్మాణంలో లక్ష్యాలు చేరుకోవాలి
పక్కా గృహాల నిర్మాణంలో ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోడానికి అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి తెలిపారు. గృహ నిర్మాణాలపై సంబంధిత శాఖ అధికారులతో శుక్రవారం ఆయన స్థానిక కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. మొదటి త్రైమాసికంలో బాపట్ల జిల్లాకు 4,898 గృహాలు పూర్తి చేయాలని లక్ష్యం అన్నారు. ప్రస్తుతం 454 మాత్రమే పూర్తి చేయడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. లక్ష్యాలను పూర్తిచేయని ఇంజినీర్లకు చార్జి మెమోలు తయారుచేయాలని ఆదేశించారు. మిగిలిన వన్ని ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని ఆదేశించారు. జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి వెంకటేశ్వర్లు, ఈఈలు, డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment