బబ్బేపల్లి కొండపై మంటలు ఆర్పివేత
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రమేష్
మార్టూరు: మండలంలోని బబ్బేపల్లి గ్రామ కొండపై గురువారం రాత్రి ఎగిసిన మంటలు సహజంగా ఏర్పడినవేనని కూకట్లపల్లి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రమేష్ తెలిపారు. ఆయన శుక్రవారం మధ్యాహ్నం సిబ్బందితో కొండపైకి వెళ్లి పరిశీలించారు. గతంలో గ్రావెల్ తవ్వకాలు జరిపిన గుంతల్లో ఎండిన చెట్ల కొమ్మలతోపాటు కొండ పరిసరాల్లో భూమి సాగు చేస్తున్న కొంతమంది రైతుల పొలాల్లో వ్యర్థాలు గాలికి కొట్టుకు వచ్చి పేరుకుపోయాయని తెలిపారు. ఎవరో విసిరిన బీడీ లేదా సిగరెట్ వల్ల మంటలు ఏర్పడి కొండపై కొంతమేర వ్యాపించాయని వివరించారు. కొండపై చెట్లకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని చెప్పారు. అక్కడక్కడా కొద్దిపాటి పొగలతో వ్యాపిస్తున్న మంటలను సిబ్బందితో కలసి ఆర్పి వేసినట్లు తెలిపారు. ఫారెస్ట్ భూమిలో సాగు చేస్తున్న రైతులు పంటకాలం పూర్తయ్యాక వ్యర్థాలను వారే తొలగించాలని, భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితి ఏర్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment