చట్టసభల్లో సగం వాటాతోనే మహిళల అభ్యున్నతి
కలెక్టర్ జె.వెంకట మురళి
బాపట్ల: చట్టసభలలో 50 శాతం మహిళలు వచ్చినప్పుడే అభివృద్ధి సాధ్యమని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ జేఎసీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో వేడుకలు నిర్వహించారు. మహిళా ఉద్యోగులకు వివిధ క్రీడల్లో పోటీలు నిర్వహించారు. లెమన్ అండ్ స్పూన్, గోనె సంచులతో పరుగు పందెం, టగ్ ఆఫ్ వార్, స్పీడ్ వాక్, మ్యూజికల్ చైర్స్ వంటి పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీలను కలెక్టర్ సందర్శించారు. ఉత్సాహంగా పాల్గొన్న ఉద్యోగినులను ఆయన అభినందించారు. అనంతరం మహిళా అధికారులు ఆర్డీఓ పి. గ్లోరియా, జిల్లా ఖజానా శాఖ అధికారి కామేశ్వరి, జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి కె. సుభాషిణి, సీడీపీఓ లక్ష్మీపార్వతిలను ఆయన ఏపీ జేఏసీ నాయకులతో కలసి ఘనంగా సన్మానించారు. పోటీలలో పాల్గొన్న ఉద్యోగులందరికీ ప్రోత్సాహక బహుమతులను అందించారు. అనంతరం మాట్లాడుతూ మహిళలపై లింగ వివక్ష లేకుండా ప్రతి కుటుంబంలో చిన్నారులను నైతిక విలువలతో పెంచాలని చెప్పారు. అప్పుడే సమాజంలో అత్యాచారాలు జరగకుండా నివారించగలమని తెలిపారు. ఇంటి నుంచే లింగ వివక్షతను ఆరికట్టాలని సూచించారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు ఉన్నాయని జిల్లా రెవెన్యూ అధికారి జి. గంగాధర్ గౌడ్ చెప్పారు. మహిళలను చిన్నచూపు చూడరాదని చెప్పారు. పోటీలలో ప్రథమ, ద్వితీయ స్థానాలలో నిలిచిన విజేతలకు ప్రభుత్వం నిర్వహించే మహిళా దినోత్సవం వేడుకలలో బహుమతులను అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీపీఓ శ్రీనివాస్, డీఎస్‌డీఓ కె. పాల్ కుమార్, ఏపీ జేఏసీ చైర్మన్ సురేష్, మహిళ విభాగం చైర్ పర్సన్ రజిని పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment