మహిళాభివృద్ధితోనే దేశ అభ్యున్నతి
● సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు ● చట్టాలపై మహిళలకు అవగాహన తప్పనిసరి ● బాల్య వివాహాలు నేరం
రేపల్లె రూరల్: మహిళాభివృద్ధితోనే దేశ అభ్యున్నతి సాధ్యమని సీనియర్ సివిల్ జడ్జి ఎం.వెంకటేశ్వర్లు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐసీడీఎస్ కార్యాలయంలో అంగన్‌వాడీ కార్యకర్తలకు శుక్రవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. మహిళలు ప్రస్తుతం అంతరిక్షాన్ని చుట్టి వచ్చేంత ఎత్తు ఎదిగారని తెలిపారు. అన్ని రంగాలలో పురుషులతో పోటీ పడుతూ తమదైన శైలిలో రాణిస్తున్నారని పేర్కొన్నారు. ఎంతో ఉన్నతస్థితిలో ఉన్నా మహిళలు సమాజంలో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని, వీటిని జయించాలంటే తప్పనిసరిగా చట్టాలపై అవగాహన ఉండాలని ఆయన సూచించారు. మైనార్టీ తీరే వరకు వివాహాలు చేయరాదని తల్లిదండ్రులకు సూచించారు. మహిళలను ఇంట్లో గానీ, ఉద్యోగం చేసేచోట గానీ మానసికంగా, లైంగికంగా ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాధిత మహిళలు న్యాయస్థానాల్లో నిర్భయంగా సహాయం పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు అవసరమైన పోస్కో, గృహ హింస, బాల్య వివాహాల నిరోధం, వరకట్న నిషేధ చట్టాలతో పాటు పలు మహిళా సంరక్ష చట్టాలపై ఆయన అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీడీపీవో ఎం.సుచిత్ర, న్యాయవాదులు కొండపల్లి శ్రీనివాసరావు, డీఎస్ హరికుమార్, మోషే, ఐసీడీఎస్ సూపర్‌వైజర్‌లు, అంగన్‌వాడీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment