ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటుతోనే పేదలకు మేలు
మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి
బాపట్ల: బాపట్లలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటుతోనే పేద ప్రజలకు మేలు జరుగుతుందని మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని చూడటం ఈప్రాంత ప్రజలకు తీరని అన్యాయమని తెలిపారు. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని 17 మెడికల్ కళాశాలలు నిర్మించేందుకు ముందుకురావటం జరిగిందన్నారు. మెడికల్ కళాశాల వలన వైద్యంతోపాటు వైద్య విద్యార్థులు కూడా వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ కళాశాలను తీసుకురావటం జరిగిందన్నారు. బాపట్ల కాకుండా మరోప్రాంతానికి మెడికల్ కళాశాల వెళ్లే అవకాశం ఉనప్పటికి ఖచ్చితంగా బాపట్లలోనే మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ప్రాంతానికే అవకాశం ఇచ్చారని తెలిపారు. బాపట్లలోనే కళాశాల ఏర్పాటు చేసేందుకు రెవెన్యూ నుంచి స్థల సేకరణ చేపట్టి కళాశాల ఏర్పాటు చేయించామని తెలిపారు. 80 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మాణానికి కూడా ఏర్పాట్లు చేశామని తెలిపారు. తాజాగా చంద్రబాబునాయుడు ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించాలని ముందుకు రావటం వలన పెత్తనం మొత్తం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోతుందని తెలిపారు. పేదలకు మెరుగైన వైద్యం అందని ద్రాక్ష పండులా ఉంటుందని తెలిపారు. ఈమేరకు ఈ ప్రాంత ప్రజలందరూ ఆలోచించి కళాశాల కోసం ఒకతాటిపైకి రావాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment