అత్యల్ప ఆదాయం ఉన్న వారిని గుర్తించేందుకే పి–4 సర్వే
జిల్లా కలెక్టర్ వెంకట మురళి
రేపల్లె రూరల్: సమాజంలో అత్యల్ప ఆదాయం కలిగిన వారిని గుర్తించి ఆదుకునేందుకు ప్రభుత్వం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోందని జిల్లా కలెక్టర్ వెంకట మురళి చెప్పారు. పీ–4 సర్వే కార్యక్రమాన్ని పట్టణంలో శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. పబ్లిక్ ప్రైవేటు అండ్ పీపుల్స్ పార్టనర్ షిప్ (పీ–4) పేరుతో రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారిని గుర్తించి ఆదుకోవటమే సర్వే ముఖ్యోద్దేశమన్నారు. ఈ పథకాన్ని ఉగాది పండుగ నుంచి ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించనున్నదన్నారు. ఉపాధి నాటికి సర్వేను పూర్తి చేసి ప్రభుత్వానికి వివరాలను అప్పగిస్తామన్నారు. బాపట్ల జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సర్వే ప్రారంభించటం ఆలస్యమైందన్నారు. ఫేజ్–2లో 8వ నుంచి 18వ తేదీ వరకు సర్వే జరుగుతుందన్నారు. నిరుపేదలను గుర్తించి వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసి జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి పర్యటించి సర్వే నిర్వహిస్తారన్నారు. సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కాకర్ల సాంబశివరావు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment