కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఊరుకోం !
ఇంకొల్లు (చినగంజాం): తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని పర్చూరు వైఎస్సార్ సీపీ సమన్వయకర్త గాదె మధుసూదనరెడ్డి స్పష్టం చేశారు. ఇంకొల్లు మండలం పావులూరులోని ఆయన స్వగృహంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్. జగన్‌మోహనరెడ్డి ఆదేశాల మేరకు తాను నియోజకవర్గ సమన్వయకర్తగా వచ్చానని తెలిపారు. ముందుగా పార్టీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. తర్వాత నియోజకవర్గంలో పర్యటించి, ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. తాము అభివృద్ధికి అవరోధం కాదని, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసే వారికి పార్టీలకతీతంగా పూర్తి సహకారం అందిస్తామని ఆయన తెలిపారు.
అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కూటమి
వైఎస్సార్ సీపీ హయాంలో ఆర్థిక సమస్య ఉన్నప్పటికీ ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్‌మోహనరెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని మధుసూదనరెడ్డి తెలిపారు. అయితే, అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు. మేని ఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని, ప్రజలను ఎంతకాలం మభ్య పెడతారని ప్రశ్నించా రు. నియోజక అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యేతో తా ము సహకారం అందిస్తామని, సీనియర్ నాయకుడుగా ఆయన నియోజకవర్గానికి కావాల్సిన అభివృద్ధి పనులుపై దృష్టి పెడితే బాగుంటుందని సూచించారు. గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాలను పెంచుకుంటూ పోతూ సామాన్య వ్యక్తులను అందుకు బలి చేయడం సమంజసం కాదని హితవు పలికారు.
ఎమ్మెల్యే తీరు బాగోలేదు !
గత 40 ఏళ్లుగా పావులూరులో రేషన్ షాపు నడుపుతున్న డీలర్లను తొలగించడం సమంజసం కాదని తెలిపారు. గ్రామాల్లో సన్న, చిన్న కారు రైతులు, రోజూవారీ కూలీల మధ్య గొడవలు పెట్టి కక్షలు, కార్పణ్యాలు పెంచడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. తమ నాయకుడు వైఎస్. జగన్‌మోహనరెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అధికార పార్టీ వైపు అధికారులు మొగ్గు చూపవచ్చు గానీ, పక్షపాత ధోరణిగా వ్యవహరించడం సరైనది కాదని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్లు కఠారి అప్పారావు, మున్నం నాగేశ్వరరెడ్డి, జంపని వీరయ్య చౌదరి, చిన్ని పూర్ణారావు, పీఏసీఎస్ మాజీ చైర్మన్‌లు పులఖండం రామకృష్ణారెడ్డి, గాదె సుబ్బారెడ్డి, గేరా స్వరాజ్ కుమార్, కరుణాకర్, రాందాస్ రెడ్డి, బిల్లాలి డేవిడ్ పాల్గొన్నారు.
గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాలుపెంచుతున్న కూటమి
పర్చూరు వైఎస్సార్ సీపీ
సమన్వయకర్త గాదె ధ్వజం
Comments
Please login to add a commentAdd a comment