పొన్నూరు: పట్టణంలోని లుంబినీ వనం అంబేడ్కర్ రీసెర్చ్ సెంటరులో కవి డాక్టర్ కత్తి పద్మారావు రచించిన ‘సావిత్రీబాయి పూలే’ పుస్తకాన్ని అంబేడ్కర్ రీసెర్చ్ సెంటర్ గుంటూరు జిల్లా కన్వీనర్ పిల్లి సుజాత ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ సావిత్రీబాయి పూలే జీవిత కథను పుస్తక రూపంలో ప్రపంచానికి తెలియ చేసిన డాక్టర్ కత్తి పద్మారావును అభినందించారు. భారతదేశంలో ప్రత్యామ్నాయ జీవన వ్యవస్థలు వెలిగించిన ఒక మహోజ్వల కాంతి దీపం సావిత్రీబాయి పూలే అని పేర్కొన్నారు. ఆ మహనీయురాలి పుస్తకాన్ని ప్రతి మహిళ చెంతకు చేరుస్తానని తెలిపారు. అంబేడ్కర్ రీసెర్చ్ సెంటర్ గుంటూరు జిల్లా కన్వీనర్‌గా సమర్థంగా బాధ్యతలు నిర్వహిస్తున్న సుజాతను పద్మారావు సత్కరించారు.
రేపు న్యాయవాదుల క్రికెట్ టోర్నమెంట్
గుంటూరు లీగల్: గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 17న గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఫెడరేషన్ చైర్మన్ కాసు వెంకటరెడ్డి శనివారం తెలిపారు. టోర్నమెంట్ సోమవారం 8:30గంటలకు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి వై.వి.ఎస్.బి.జి.పార్థసారథి హాజరై టోర్నమెంట్‌ను ప్రారంభిస్తారని చెప్పారు. స్పోర్ట్స్ అండ్ కల్చర్ కార్యదర్శి సయ్యద్ ఇస్మాయిల్, ఈసీ మెంబర్స్ ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు.
విత్తన గుళికల విధానంతో మేలు
ప్రకృతి వ్యవసాయ డీపీఎం కె.అమలకుమారి
నరసరావుపేట రూరల్: వర్షాభావ పరిస్థితుల్లో రైతులు భూమిని కప్పి ఉంచే విత్తన గుళికల తయారీ విధానాన్ని అవలంభించాలని ప్రకృతి వ్యవసాయ డీపీఎం కె.అమలకుమారి తెలిపారు. ప్రకృతి వ్వవసాయం జిల్లా కార్యాలయంలో సిబ్బందికి నిర్వహిస్తున్న మూడవ రోజు శిక్షణా కార్యక్రమానికి జిల్లాలోని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది హాజరయ్యారు. డీపీఎం మాట్లాడుతూ వేసవిలో ప్రతి రైతు తనకున్న పొలంలో ఈ విత్తన గుళికల విధానం ఆచరించాలని తెలిపారు.