జూట్‌ సాగు.. లాభాలు బాగు | - | Sakshi
Sakshi News home page

జూట్‌ సాగు.. లాభాలు బాగు

Published Sat, Mar 22 2025 2:04 AM | Last Updated on Sat, Mar 22 2025 2:01 AM

అద్దంకి: సంప్రదాయ పంటల సాగుతో లాభాలు రాక విసుగెత్తిన రైతులు పత్తి, పొగాకు పంటలకు ప్రత్యామ్నాయంగా జూట్‌ పంటను సాగు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు గడిస్తున్నారు. గోనె సంచులు, బ్యాగులతోపాటు వివిధరకాల వస్తువుల తయారీకి ఉపయోగపడే ఈ జూట్‌ పంట విస్తీర్ణం జిల్లాలో పెరుగుతోంది. కొన్ని సంవత్సరాల నుంచి బాపట్ల జిల్లాలోని అద్దంకి, యద్దనపూడి, పర్చూరు నియోజకవర్గంలోని మార్టూరు మండలాల్లో 2 వేల ఎకరాల్లో జూట్‌ను సాగు చేస్తున్నారు. ఇక్కడ పండించే జూట్‌ పంటను విత్తనాల కోసం సాగు చేస్తారు. ఈ విత్తనాలు ఈశాన్య రాష్ట్రాల్లో నార కోసం పండించే జూట్‌ పంట సాగుకు ఎగుమతి అవుతుంటాయి. జూట్‌ పంట జనుము, గోగు జాతికి చెందినది. దీని నుంచి తీసిన నారను ఉపయోగించి గోనె సంచులు, బ్యాగ్‌లు, ఇతర వస్తువులను తయారు చేస్తారు. అయితే దీన్ని మన రాష్ట్రంలో విత్తనాల కోసం పండిస్తారు. పండించిన విత్తనాలు పశ్చిమ బెంగాల్‌, తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతాయి. అక్కడి రైతులు ఈ విత్తనాలను పొలాల్లో సాగు చేసి ఏపుగా పెంచి గోగు, జనప నార తీసిన విధంగా నార తీసి విక్రయిస్తారు.

ఇలా సాగు చేస్తారు...

జూట్‌ పంటకు ఉమ్మడి ప్రకాశం జిల్లా అనుకూలంగా ఉంటుంది. ఈ నేలలను రైతులు ముందుగా మెత్తగా అయ్యేలా పశువుల ఎరువును కలిపి కలియదున్నుతారు. ప్రస్తుతం జేఆర్‌ఓ–8432, జేఆర్‌ఓ–878 రకం విత్తనాలను సాగు చేస్తున్నారు. ఎకరాకు కిలో విత్తనం సరిపోతుంది. మొక్కలు జానెడు ఎత్తుకు రాగానే, తరువాత రెండు సార్లు అంతర సేద్యం చేస్తారు. మోకాలి ఎత్తులో తల తుంచుతారు. దాంతో పక్క కొమ్మలు వచ్చి మరింత దిగుబడికి దోహపడుతుంది. విత్తన రోజు నుంచి 90 రోజుల్లో పంట నుంచి విత్తనాలు తీయడానికి సిద్ధం అవుతుంది. ఎకరాకు 5 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఈ పంటకు విత్తనం ధర చాలా తక్కువ. సేద్యాలు, ఎరువులు, పురుగు మందులు కలుపుకుని ఎకరాకు రూ.5 వేల లోపే అవుతుంది.

ప్రస్తుత ధర ఇలా..

జూట్‌ పంట విత్తనాలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతాయి. ప్రస్తుతం క్వింటా ధర రూ.5 వేలు ఉంది. తొలుత రూ.6 వేలు పలికింది. అన్నీ కుదిరితే ఒక్కో సంవత్సరం క్వింటా విత్తనాలు రూ.15 వేల వరకు పలికిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుత ధర ప్రకారం లెక్కి గట్టినా ఐదు క్వింటాళ్ల లెక్కన ఎకరాకు రూ.25 వేలు రాగా, నికర ఆదాయం 20 వేలు వరకు మిగులుతుందని రైతులు చెప్తున్నారు.

జిల్లాలో రెండు వేల ఎకరాల్లో సాగు చేస్తున్న రైతులు

అద్దంకి, మార్టూరు, యద్దనపూడి మండలాల్లో అధికం

క్వింటా రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు పలుకుతున్న ధర

అన్నీ కుదిరితే ఎకరాకు రూ.లక్ష వరకు ఆదాయం

ఈశాన్య రాష్ట్రాలకు విత్తనాలు ఎగుమతి

విస్తీర్ణం తక్కువ ఉంటే అధిక ధర

జూట్‌ పంట క్వింటాలు ధర రూ.5 వేలు నుంచి రూ.15 వేల వరకు పలుకుతోంది. ఒక్కో సంవత్సరం ఒక్కో రేటు ఉంటుంది. ఇక్కడ ప్రత్యేక మార్కెట్‌ ఏమీ లేదు. కొందరు వ్యాపారులు విత్తనాలను కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు.

– ధన్‌రాజ్‌, ఏడీఏ

గత సంవత్సరం సాగు చేశా

నేను గత సంవత్సరం జూట్‌ సాగు చేశాను. వరుస కుదిరితే మంచి లాభాలే వస్తాయి. ధర బాగుండాలి. గతంలో రేటుతో పోలిస్తే ప్రస్తుతం ధర తక్కువగా ఉన్నట్లే . అయినా ఫర్వాలేదు. రైతుకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాన్ని ఇచ్చే పంటగా జూట్‌ చెప్పుకోవచ్చు. ప్రస్తుతం క్వింటా రూ.5 వేలు ఉంది.

– చెరుకూరి సుబ్బారావు, రైతు

జూట్‌ సాగు.. లాభాలు బాగు 1
1/3

జూట్‌ సాగు.. లాభాలు బాగు

జూట్‌ సాగు.. లాభాలు బాగు 2
2/3

జూట్‌ సాగు.. లాభాలు బాగు

జూట్‌ సాగు.. లాభాలు బాగు 3
3/3

జూట్‌ సాగు.. లాభాలు బాగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement