చెరుకుపల్లి: దేశ రక్షణలో సీఐఎస్‌ఎఫ్ ఎంతో కీలక పాత్ర పోషిస్తోందని అస్సాం సీఐఎస్‌ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ జి.శ్రీనివాస్ పేర్కొన్నారు. సీఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో 15 రోజుల క్రితం ప్రారంభమైన సైకిల్ ర్యాలీ శుక్రవారం చెరుకుపల్లి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక పోలీసులు స్వాగతం పలికారు. అసిస్టెంట్ కమాండెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తీర ప్రాంతంలో సైకిల్ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. రెండు బృందాలుగా ఈ నెల 31వ తేదీ నాటికి గుజరాత్ నుంచి కన్యాకుమారి చేరుకుంటామని ఆయన తెలిపారు. 8 మంది మహిళలు కూడా బృందాలలో ఉన్నారని పేర్కొన్నారు. చెరుకుపల్లి ఆర్యవైశ్య కల్యాణ మండపంలో మధ్యాహ్న భోజన విరామం అనంతరం సైకిల్ ర్యాలీ కొనసాగించారు.
వేమవరం వద్ద స్వాగతం
భట్టిప్రోలు: సీఐఎస్‌ఎఫ్ సైకిల్ ర్యాలీ శుక్రవారం మధ్యాహ్నం బాపట్ల వైపు భట్టిప్రోలు మండలం వేమవరం వరకు చేరుకుంది. ఈ సందర్భంగా బృందసభ్యుల కోసం భట్టిప్రోలు పీహెచ్‌సీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి అత్యవసరమైన మందులు పంపిణీ చేశారు. భట్టిప్రోలు హైవేపై నుంచి కనగాల, చెరుకుపల్లి, బాపట్ల, చీరాల వరకు ర్యాలీ కొనసాగనుంది.
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
బాపట్ల టౌన్: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ట్రైనీ డీఎస్పీ రావూరి అభిషేక్ తెలిపారు. సీఐఎస్‌ఎఫ్ నిర్వహిస్తున్న సైకిల్ ర్యాలీ శుక్రవారం సాయంత్రం బాపట్ల జిల్లాలోకి ప్రవేశించింది. జిల్లా సరిహద్దులో బాపట్ల ట్రైనీ డీఎస్పీ రావూరి అభిషేక్ స్వాగతం పలికారు. విశాఖపట్నంలోని హెచ్‌పీసీఎల్ వీఆర్ వైజాగ్ కమాండెంట్ హర్షిత్ దైవానంద్ తదితరులు ప్రసంగించారు.
సీఐఎస్‌ఎఫ్ సైకిల్ ర్యాలీ