
మొక్కజొన్నకు వాన దెబ్బ
చుండూరు(వేమూరు): గాలులతో కూడిన వర్షం వల్ల మొక్కజొన్న పంట పూర్తిగా నేలవాలింది. పంట ఓదెలు నీటిలో తడిసి పోవడం వల్ల విత్తనాలు బూజుపట్టాయి. వేమూరు నియోజక వర్గంలోని వేమూరు, కొల్లూరు, భట్టిప్రోలు, అమర్తలూరు, చుండూరు మండలాల్లో జొన్న, మొక్కజొన్న పంటలు సాగు చేశారు. రైతులు మొక్కజొన్న కండెలు విరగదీసే పనుల్లో నిమగ్నమయ్యారు. జొన్న పంట కోసి ఓదెలు వేశారు. మంగళవారం రాత్రి కురిసిన వర్షాల వల్ల జొన్న పంట దెబ్బతిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కల్లాల్లో ఎండబెట్టిన మొక్కజొన్న తడిసి పోవడంతో ఇబ్బంది పడుతున్నారు. తిరిగి ఆరబెడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు అతివృష్టి, అనావృష్టి వల్ల నష్టం వాటిల్లుతుండటంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పండించిన పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాల వల్ల తడిసిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
ఈదురు గాలుల ప్రభావం
కొల్లూరు : రబీ పంట చేతికందే సమయంలో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు రైతులను బెంబేలెత్తిస్తున్నాయి. పంట కోతకొచ్చిన సమయంలో ఇలా నేలవాలడంతో మొక్కజొన్న కండెలు ఇరగదీయడానికి కూలీలకు అదనపు ఖర్చు కానుంది. కండెలు పూర్తి స్థాయిలో విరిచేందుకు ఆస్కారం ఉండదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాలుల కారణంగా కృష్ణా పరివాహక లంక గ్రామాలలో సాగులో ఉన్న అరటి, తమలపాకు, బొప్పాయి, దొండ వంటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

మొక్కజొన్నకు వాన దెబ్బ