సూపర్‌బజార్(కొత్తగూడెం): జూన్ మాసం వచ్చి 20 రోజులు గడిచినా తొలకరి పలుకరించలేదు. ఎన్నో ఆశలతో సాగుకు సిద్ధమైన రైతు వర్షం కోసం ఆకాశం వైపు చూస్తున్నాడు. వరుణుడు కరుణించకపోవడంతో వానాకాలం పంట సీజన్ ఆరంభంలోనే నిరాశ చెందుతున్నాడు. ప్రకృతి విపత్తుల నేపథ్యంలో పంటలు దెబ్బతినకుండా ఉండేందుకు రాష్ట్ర పభుత్వం ఈసారి వానాకాలం సీజన్‌ను ఒకనెల ముందుగానే ప్రారంభించాలని దిశా నిర్దేశం చేసింది. వ్యవసాయ, ఉద్యాన అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రైతాంగాన్ని ఆ దిశగా చైతన్యం చేయాలని సూచించింది.
చినుకు లేకపోవడంతో ముందస్తు మాటేమోకానీ ఎప్పటి లాగే రైతులు వానాకా లంలో వ్యవసాయ పనులు చేసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. వరుణుడు ముఖం చాటేయడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. యాసంగి ధాన్యం అమ్ముకోవడానికి నానా కష్టాలు పడ్డ రైతన్నలకు వానాకాలంలో అనా వృష్టి వెంటాడుతోంది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించాక ఎర్రనేలల్లో 50–60 మి.మీ, నల్లరేగడిలో 60–70 మి.మీ వర్షపాతం నమోదైన తర్వాతే విత్తనాలు వేసుకోవాలని వ్యవసాయ, ఉద్యాన, కృషి విజ్ఞాన కేంద్రం అధికారులు సూచిస్తున్నారు. అయితే జిల్లాలో కొన్ని చోట్ల రైతులు వర్షం వస్తుందనే నమ్మకంతో పత్తి విత్తనాలు నాటి నష్టపోయారు.
ప్రధానంగా బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో కొందరు రైతులు పత్తి గింజలు వేశారు. వర్షాభావంతో అవి మొలకెత్తక చిత్తయ్యారు. వేసవి తీవ్రతకు నాటిన విత్తనాలు దెబ్బతింటాయని ఆందోళన చెందుతున్నారు. ఈసారి ఎండతీవ్రత విపరీతంగా ఉండటంతో జిల్లాలోని చెరువులు, కుంటలు నీళ్లులేక వెలవెలబోతున్నాయి. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో జరిగిన చెరువుల పండుగలో ఈ విషయం స్పష్టంగా కనిపించింది. ఆయా నీటివనరులు ఉన్న ప్రాంతాలలో ఆయకట్టు రైతులు కూడా వరుణుడి దీవెనల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో గత వానాకాలం కంటే అదనంగా 72,398 ఎకరాలలో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. కానీ వర్షాభావ పరిస్థితులతో సాగుకు ముందుకు సాగడంలేదు.
లోటు వర్షపాతం..
జూన్ మాసంలో సాధారణ వర్షపాతం 225.3 మి.మీ నమోదు కావాల్సి ఉంది. ఇప్పటివరకు అక్కడక్కడా వర్షాలు పడగా 144.8 మి.మీ వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం కంటే 56.6 మి.మీ లోటు ఉందని అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఎదురు చూస్తున్నాం
వర్షాల కోసం ఎదురుచూపులు చూస్తున్నాం. వ్యవసాయ సీజన్‌లో వర్షాలు రాకుండా కష్టపడి పండించిన తర్వాత లేదా పంటలు చేతికొచ్చే సమయానికి వర్షాలు వచ్చి మమ్మల్ని నష్టపరుస్తున్నాయి. ఈ వర్షాకాలంలో మొదట్లోనే వర్షం రాక కోసం ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు నెలకొంది.
–ప్రసాద్, రైతు, లక్ష్మీదేవిపల్లి
వర్షాలు వచ్చాకే విత్తుకోవాలి
వర్షాలు వచ్చిన తర్వాతే విత్తనాలు వేయాలి. ముందస్తుగా విత్తనాలు వేసి రైతులు నష్టపోవద్దు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఈ విషయాన్ని ప్రచారం చేశాం. రైతులు అప్రమత్తంగా ఉండాలి.
–కొర్స అభిమన్యుడు, జిల్లా వ్యవసాయాధికారి
Comments
Please login to add a commentAdd a comment