మార్కెట్‌లో కూరగాయలు కొనుగోలు చేస్తున్న ప్రజలు
ఇల్లెందురూరల్: జిల్లాలో వర్షాభావం వల్ల కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. ఏ కూరగాయలు కొనాలన్నా అమాంతం వాటి ధర పెరిగిపోవడంతో అన్ని వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటి వరకు ఎండల కారణంగా కూరగాయల దిగుబడులు ఆశించిన మేర లేవు. వర్షాకాలం ప్రారంభమైనా వరణుడి కరుణ లేకపోవడంతో వాటి ఉత్పత్తి తగ్గి ధరలు చుక్కల సరసన చేరాయి. విపణిలో వాటిని కొనుగోలు చేయడానికి వెళ్లిన వారికి ధరలు చూసి కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. వర్షాకాలం ప్రారంభంలోనే ధరలు ఇలా ఉంటే మున్ముందు పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. అసలే నిత్యావసర ధరలు నింగినంటుతుంటే కనీసం కూరగాయలు తినే పరిస్థితి లేకపోవడంపై వంటింటి గృహిణులు పెదవి విరుస్తున్నారు.
12 వేల ఎకరాల్లో సాగు
టమాట ధర అప్పుడే కిలో రూ.40 నుంచి రూ.50 వరకు పెరిగిపోయింది. బీరకాయలు కిలో రూ.80, చిక్కుడుకాయలు కిలో రూ.100 వరకు పలుకుతున్నాయి. నాలుగైదు రకాలు తప్ప ప్రతి కూరగాయ ధర కొండెక్కుతోంది. జిల్లావ్యాప్తంగా ఏటా 12 వేల ఎకరాల్లో కూరగాయలు సాగవుతాయని ఉద్యానశాఖ అధికారులు చెపుతున్నారు. వర్షాకాలంలో 6 వేల ఎకరాల్లో.. వేసవిలో 2,500 ఎకరాల్లో.. చలికాలంలో 3,500 ఎకరాల విస్తీర్ణంలో రైతులు కూరగాయల పంటలను సాగుచేస్తుంటారని పేర్కొంటు న్నారు. ఉద్యాన పంటల్లో అంతర్‌పంటగా కొంద రు, సీజన్‌కు అనుగుణంగా కూరగయాల సాగు చే సే రైతులు మరికొందరు ఉన్నారని వివరిస్తున్నారు.
కూరగాయలు సాగయ్యే గ్రామాలివే..
జిల్లాలో ఇల్లెందు మండలంలోని కొమరారం, పోచారంతండా, పోలారం, మాణిక్యారం, రేపల్లెవాడ, రాఘబోయినగూడెం తదితర గ్రామపంచాయతీల నుంచి కూరగాయలు అత్యధిక విస్తీర్ణంలో సాగవుతుంటాయి. ఆ తరువాత అశ్వారావుపేట మండలంలో సాగవుతున్నట్లు ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. వీటితోపాటు చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, తిప్పనపల్లి, మాచినేనిపురం, వినోభానగర్, గుండ్లరేవు, సుజాతనగర్, సింగభూపాలెం, రాఘవాపురం, బంగారుచెలక, జగన్నాథపురం, జగ్గారం, అశ్వాపురం, ఇరవండి, పట్టేనగర్, చిన్నబండరేవు, పెద్దబండరేవు, దుమ్ముగూడెం, గుమ్మారం, తీగలేరు, జానంపాడు, కరకగూడెం, సంపత్‌నగర్, ఆళ్లపల్లి, మామకన్ను తదితర గ్రామాల్లో సాగుచేస్తుంటారు.
ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి
వర్షాకాలం ప్రారంభమైనా సరైన రీతిలో వర్షాల్లేక కూరగాయల పంటలు దెబ్బతింటున్నాయి. ప్రస్తుతం ఉన్న సాగు విస్తీర్ణం జిల్లా అవసరాలకు ఏమాత్రం సరిపోదు. చాలా వరకు కూరగాయలను ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. టమాట మదనపల్లి నుంచి, మిర్చి బాపట్ల నుంచి.. ఇలా పలు చోట్ల నుంచి కూరగాయలను దిగుమతి చేసుకుంటున్నారు. అయితే స్థానికంగా లభ్యమయ్యే కూరగాయల ధరలు కూడా తక్కువేం లేకపోవడం గమనార్హం.
ఎందుకీ పరిస్థితి
జనాభా అవసరాలకు అనుగుణంగా కూరగాయల ఉత్పత్తికి అవసరమైన ప్రోత్సాహం రైతులకు అందడం లేదు. కనీసం ఉప ఉత్పత్తులపైనన్నా ప్రజలను పూర్తిస్థాయిలో అధికారులు చైతన్యం చేయడం లేదు. 12 వేల ఎకరాల్లో కూరగాయల పంటలు సాగవుతున్నా జిల్లాలో ఒక్కటంటే ఒక్కటి కూడా కూరగాయలు నిల్వ చేసుకునేందుకు కోల్డ్‌స్టోరేజ్ లేదు. పండించిన పంట మార్కెట్‌కు తప్ప నిల్వ చేసుకునేందుకు వేరే మార్గం కనిపించడం లేదు. జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి మార్కెట్ కమిటీలు ఉన్నాయి. కానీ ఏఒక్క కమిటీ కూడా కూరగాయలు నిల్వ చేసేందుకు కూల్‌చాంబర్ల నిర్మాణానికి ప్రాధాన్యమివ్వలేదు. జిల్లాలో ఎక్కువగా చిన్న కమతాల్లోనే కూరగాయలు పండిస్తున్నారు. హెక్టార్ల కొద్ది విస్తీర్ణంలో సాగు జరగడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment