గొందిగూడెంలో ఫారెస్ట్ స్టేషన్ ఏర్పాటు..
అశ్వాపురం: మండల పరిధిలోని గొందిగూడెం సెక్షన్‌లో బండ్లవారిగుంపు బీట్‌లో ఫారెస్ట్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. స్టేషన్ ఏర్పాటుకు స్థలాన్ని శనివారం ఎఫ్‌డీఓ సయ్యద్ మక్సూద్ మోహిద్దిన్, ఎఫ్‌ఆర్‌ఓ రమేష్ పరిశీలించారు. ముందే రూపొందించిన కంటైనర్‌ను అక్కడకు చేర్చి, స్టేషన్ నిర్వహించనున్నారు. అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఫారెస్ట్ స్టేషన్లు ఏర్పాటు చేస్తుండగా, మణుగూరు మండలం కూనవరంలో గతంలో ఏర్పాటు చేయగా, ఇప్పుడు అశ్వాపురం రేంజ్‌లో ఏర్పాటుకు ఉపక్రమించారు. వీటి ఏర్పాటుతో అడవులు, వన్యప్రాణులు, అటవీ ఉత్పత్తుల సంరక్షణ పటిష్టంగా చేపట్టవచ్చని అటవీశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. స్టేషన్‌లో సిబ్బంది ఉండటంతోపాటు సామగ్రి భద్రపరచనున్నారు. వేసవికాలంలో అడవుల్లో చెలరేగే అగ్ని కీలలను నియంత్రించే ఫైర్ బ్లోయర్స్‌ను కూడా ఇక్కడే ఉంచనున్నారు. బండ్లవారిగుంపు బీట్‌లో ఫారెస్ట్ స్టేషన్ ఏర్పాటుతో మండల పరిధిలోని మారుమూల గిరిజన గ్రామాలైన తుమ్మలచెరువు, వెంకటాపురం, గొందిగూడెం, గొందిగూడెం కొత్తూరు, ఎలకలగూడెం గ్రామ పంచాయతీల పరిధిలో అడవులు, వన్యప్రాణుల సంరక్షణ కట్టుదిట్టం కానుంది.
స్థల పరిశీలన చేసిన ఎఫ్‌డీఓ
Comments
Please login to add a commentAdd a comment