సర్వే పూర్తి చేయాలి
సింగరేణి(కొత్తగూడెం): సంక్షేమ పథకాల సర్వే ఆదివారం సాయంత్రంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. శనివారం అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, జెడ్పీ సీఈఓ, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, హౌసింగ్ డిపార్ట్‌మెంట్ అధికారులతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సర్వే పురోగతిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంక్షేమ పథకాల లబ్ధిదారుల సర్వే పూర్తి చేసి, గ్రామసభల నిర్వహణకు సిద్ధంకావాలని అధికారులను ఆదేశించారు. రేషన్ కార్డ్‌లో కుటుంబ సభ్యుల పేర్ల నమోదుకు వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, వాటిని కూడా గ్రామసభల్లో ప్రదర్శించాలని సూచించారు. జాబితాలో లేని అర్హులను గుర్తించి, వారి నుంచి దరఖాస్తులను స్వీకరించాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వేలో కచ్చితమైన సమాచారం నమోదు చేయాలని ఆదేశించారు.
వేగవంతం చేయాలి
సంక్షేమ పథకాల సర్వే వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ అధికారులను ఆదేశించారు. సర్వే పురోగతిపై తహసీల్దార్లు, ఎంపీడీఓలతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం భూభారతి పోర్టల్‌లో నమోదైన సాగు యోగ్యమైన భూములకు రైతు భరోసా కింద రూ. 12 వేలు చెల్లించనుందని చెప్పారు. సాగుకు అనుకూలంగా లేని భూములను గుర్తించి, పెట్టుబడి సాయం జాబితా నుంచి తొలగించాలన్నారు. ఇప్పటివరకు రెవెన్యూ 194 గ్రామాల్లో సర్వే పూర్తయిందని, మిగిలిన 160 రెవెన్యూ గ్రామాల సర్వే త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కొత్త రేషన్ కార్డు కోసం 29,141 దరఖాస్తులు వచ్చాయని, సభ్యుల పేర్లు చేర్పింపునకు సంబంధించి 10,796 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. దరఖాస్తులను పరిశీలించి నివేదికలు సమర్పించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment