కౌలు రైతుకేదీ భరోసా?
బూర్గంపాడు: రైతు భరోసా పథకం అమలులో ప్రభుత్వం కౌలు రైతుల ఊసే ఎత్తడం లేదు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు విస్మరిస్తోంది. రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు ఎట్టకేలకు ప్రభుత్వం సిద్ధమైంది. ఎన్నికల హామీ మేరకు ఎకరాకు రూ.15 వేలు కాకుండా రూ.12వేల పెట్టుబడి సాయమందిస్తామని ప్రకటించింది. ఈ నెల 26 నుంచి రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సాగుకు యోగ్యమైన భూములను గుర్తించి, గ్రామసభలు నిర్వహించిన అనంతరం రైతుభరోసా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఎన్నికల ముందు హామీ..
రైతు భరోసా పథకాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపజేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. గతేడాది వానాకాలం సీజన్‌లో ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇవ్వలేదు. యాసంగి సీజన్‌లో మాత్రం ఎకరాకు రూ.5 వేల చొప్పున అందించింది. ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో పట్టాదారు రైతులు, కౌలురైతులు ఎవరికీ పెట్టుబడి సాయం అందలేదు. ఈ ఏడాది యాసంగి పంటల సాగు మొదలై నెలరోజులు కావొస్తున్న తరుణంలో పెట్టుబడి సాయమందిస్తామని ప్రభుత్వం ప్రకటించటంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. రైతుభరోసా విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వం కౌలు రైతుల ఊసెత్తకపోవటంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో కౌలు రైతులు కూడా పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
క్లస్టర్ల వారీగా పరిశీలన
రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసింది. గురువారం నుంచి క్లస్టర్ల వారీగా వ్యవసాయ, రెవెన్యూశాఖల అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో భూములను పరిశీలించి వివరాలను నమోదు చేస్తున్నారు. ప్రభుత్వ భూములు, గుట్టలు, కొండలు, నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్స్‌ను గుర్తించి నివేదికలను సిద్ధం చేస్తున్నారు. నివేదికల ఆధారంగా గ్రామసభలు నిర్వహించి రైతు భరోసా అందించే భూముల వివరాలను ఆయా గ్రామపంచాయతీల్లో ప్రదర్శించనున్నారు.
పంట ఉత్పత్తుల విక్రయాలకు సమస్యే..
జిల్లాలో సుమారు 28 వేలమంది వరకు కౌలు రైతులున్నారు. వీరంతా రెండు మూడు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటున్నారు. పట్టాదారులకు రైతు భరోసా అందుతుండటంతో భూమి సాగు చేస్తున్న కౌలురైతులకు ఎలాంటి ఉపయోగం ఉండటం లేదు. పంట ఉత్పత్తులు అమ్ముకునే సమయంలో కూడా కౌలు రైతులు పట్టాదారుల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడాల్సి వస్తుంది. కౌలు రైతులను గుర్తించటం వారికి పెట్టుబడి సాయం అందించటంపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటనా చేయలేదు. దీంతో కౌలు రైతులు ఆందోళన చెందుతున్నారు. తమకు పెట్టుబడి సాయం అందించాలని కోరుతున్నారు.
రైతు భరోసా పథకం
అమలుకు రంగం సిద్ధం
క్షేత్రస్థాయిలో సాగు భూములను పరిశీలిస్తున్న అధికారులు
సాయం కోసం ఎదురుచూస్తున్న
28 వేల మంది కౌలు రైతులు
Comments
Please login to add a commentAdd a comment