తగ్గుతున్న అటవీ ఉత్పత్తులు
● సేకరణ లేక ఏటేటా ఆదాయం కోల్పోతున్న జీసీసీ ● ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లక్ష్యం రూ.36.76 లక్షలు ● ఇప్పటివరకు కొనుగోలు చేసింది రూ.23.85 లక్షలే
పాల్వంచరూరల్: ఏజెన్సీలో గిరిజనులకు ఉపాధి, ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే అటవీ ఉత్పత్తుల సేకరణ క్రమంగా తగ్గిపోతోంది. పోడు సాగు, అడవుల నరికివేతతో అరుదైన అటవీ ఫలసాయాన్ని అందించే చెట్లు అంతరించిపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏటా నిర్దేశిత లక్ష్యాన్ని జీసీసీ(గిరిజన సహకార సమితి) అధిగమించలేపోతోంది. తిరోగమనంలో పయనిస్తూ ఆర్థికంగా సన్నగిల్లుతోంది.
అటవీ ఉత్పత్తులను పరిశీలిస్తే..
జిల్లాలోని ఐటీడీఏ పరిధి గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో భద్రాచలం, పాల్వంచ, ఇల్లెందు, దమ్మపేట, మణుగూరు జీసీసీ బ్రాంచీలను, వాటి పరిధిలో 150 డీఆర్ డిపోలు నిర్వహిస్తున్నారు. అటవీ ఉత్పత్తుల కొనుగోళ్లు, అమ్మకాలు, పంట ఉత్పత్తులు ధాన్యం, మిర్చి కొనుగోళ్లు చేపడుతున్నారు. పెట్రోల్ బంక్‌లు కూడా నిర్వహిస్తున్నారు. గత ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు రూ.36.76 లక్షల విలువైన అటవీ ఉత్పత్తులను సేకరించాల్సి ఉండగా, కేవలం రూ.23.85 లక్షల విలువైన ఉత్పత్తులను మాత్రమే సేకరించారు. ఇంకా రూ.12.91 లక్షల విలువైన ఉత్పత్తులు సేకరించాల్సి ఉంది. ఇందులో ముష్టిగింజల సేకరణ లక్ష్యం 217 క్వింటాళ్లుకాగా, 191 క్వింటాళ్లు సేకరించారు. ఇప్పు పువ్వు 282.66 క్వింటాళ్లు లక్ష్యంకాగా 16.94 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. ఇప్పబద్ద 254 క్వింటాళ్లకు గాను, ఇప్పటివరకు 335.27 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. ఇప్పబద్ద మాత్రం లక్ష్యానికి మించి కొన్నారు. గతేడాది రూ.1.55 కోట్ల అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని లక్ష్యం నిర్దేశించుకోగా రూ.23.18 లక్షల విలువైన ఉత్పత్తులు మాత్రమే సేకరించారు.
అసలు సేకరించనవి..
అగర్‌బత్తీల తయారీలో వినియోగించే నరమామిడి చెక్కకు జాతీయసాయి మార్కెట్‌లో గిరాకీ ఉంటుంది. అయినా గతేడాది నుంచి జీసీసీ కేజీ కూడా కొనుగోలు చేయలేదు. ఈ ఏడాది 10 క్వింటాళ్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా గ్రాము కూడా కొనలేదు. చింతపండు 20 క్వింటాళ్లు, గచ్చకాయలు 2 క్వింటాళ్లు, కానుగ గింజలు 20 కింటాళ్లు సేకరించాలని లక్ష్యం నిర్దేశించుకుంది. ఆయా ఉత్పత్తులు గిరిజనుల సేకరించకపోడంతో కొనుగోళ్లు జరగడం లేదు. నరమామిడి, ఇప్ప చెట్లు అటవీ ప్రాంతంలో తగ్గిపోయినట్లు అధికారులు గుర్తించారు.
దళారుల వల్లే..
గిరిజనులు సీజన్‌లో సేకరించే అటవీ ఉత్పత్తులను జీసీసీ గ్రామాల్లోని సేల్స్ డిపోల ద్వారా కొనుగోలు చేస్తుంది. కొన్నేళ్లుగా దళారులు అటవీ ఉత్పత్తులను కొనుగోళ్లు చేస్తుండటంతో జీసీసీకి ఆదాయం తగ్గిపోతోంది. గిరిజన హాస్టళ్లకు సరుకులు జీసీసీ నుంచే కొనుగోలు చేయాల్సి ఉన్నా, వార్డెన్లు మాత్రం బయట మార్కెట్‌లో కొనుగోళ్లు చేస్తున్నా రు. అటవీ ఉత్పత్తుల సేకరణపై పలువురు గిరిజనులు కూడా ఆసక్తి చూపడంలేదు. అటవీ ఉత్పత్తులను దళారులకు విక్రయించకుండా, డిపోల్లోనే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీఓ రాహుల్ ఆదేశించినా జీసీసీ అధికారులు నిర్లక్ష్యం వీడడంలేదు. ఫలితంగా రాబడి తగ్గింది. దీంతో పాటు బ్రాంచిలపై కొరవడిన పర్యవేక్షణ కూడా జీసీసీ తిరోగమనానికి మరో కారణంగా చెప్పవచ్చు.
సేకరణ తగ్గింది
జిల్లాలో గతంలో అటవీ ఉత్పత్తుల సేకరణ గణనీయంగా ఉండేది. అటవీ ప్రాంతంలో ఫలసాయం చెట్లు తగ్గిపోవడం, అటవీ ఉత్పత్తుల సేకరణలో గిరిజనులు ఆసక్తి చూపకపోవడంతో ఆశించిన స్థాయిలో అటవీ ఉత్పత్తుల సేకరణ జరగడంలేదు. దీంతో ఆదాయం లక్ష్యం క్రమక్రమంగా తగ్గిపోతోంది.
–సమ్మయ్య, జీసీసీ డీఎం
Comments
Please login to add a commentAdd a comment