పాలకవర్గాల దాడిని ప్రతిఘటించాలి
సింగరేణి(కొత్తగూడెం): ఉత్పత్తి శక్తులైన కార్మికులు, రైతులపై పాలక వర్గాల దాడిని ప్రతిఘటించాలని, 8 గంటల పనిదినం, కార్మిక చట్టాల పరిరక్షణకు కార్మికవర్గం సమరశీల ప్రతిఘటన పోరాటాలకు సిద్ధం కావాలని ఐఎఫ్‌టీయూ (ఇఫ్టూ) జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ అపర్ణ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక కొత్తగూడెంక్లబ్‌లో ఇఫ్టూ రాష్ట్ర అధ్యక్షురాలు జి.అనురాధ, ఐ.కృష్ణ అధ్యక్షతన జరిగిన విలీన సభలో ఆమె మాట్లాడారు. 8 గంటల పనివిధానాన్ని 12 గంటలుగా మార్చాలన్న లక్ష్యంతో ఇటీవల ఎల్‌ఎన్‌డీ చైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యం వారానికి 90 గంటలు పనిచేయాలని సిఫార్సు చేశాడన్నారు. దేశంలో ఫాసిజం పెరుగుతోందని, పార్లమెంటరీ, రాజ్యంగబద్ధ సంస్థల విధ్వంసం జరుగుతోందని తెలిపారు. 1978లో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఏర్పడిందని, కార్మిక క్షేత్రంలో ఇదో చారిత్రక పరిణామమని, కార్మిక వర్గం వివిధ ట్రేడ్ యూనియ న్ల కింద పాలకవర్గ పార్టీలతో జతకట్టటం లేదా రాజీ మార్గంలో పయనిస్తూ కార్మిక పోరాటాలను వారి ప్రయోజనాలను బలహీన పరుస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ విధానాలతో విప్లవ కార్మిక సంఘమై ఐఎఫ్‌టీయూ ఆవిర్భవించిందని వివరించారు. కాగా, తొలుత కొత్తగూడెం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అపర్ణ, సాధినేని వెంకటేశ్వరరావు జెండా ఆవిష్కరించారు.కార్యక్రమంలో డీఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.జనార్దన్, ఐఎఫ్‌టీయూ జాతీయ ఉపాధ్యక్షులు బి.ప్రదీప్, ప్రసాద్, శ్రీనివాస్, జే.సీతారామయ్య, కొక్కు సారంగపాణి, నెమెళ్ల సంజీవ్, ఎండీ రాసుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment