వనం వీడి జనంలోకి రండి..
●మావోయిస్టులకు ఎస్పీ సూచన ●మావోయిస్టుల కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం
చర్ల: వనం బాట పట్టిన మావోయిస్టులంతా జనంలోకి వస్తే మిగిలిన శేష జీవితమంతా సంతోషంగా గడపవచ్చని, ప్రభుత్వం కూడా సహాయ, సహకారాలు అందిస్తుందని ఎస్పీ రోహిత్‌రాజు పేర్కొన్నా రు. శనివారం చర్ల పోలీస్ స్టేషన్ ఆవరణలో సీఐ రాజువర్మ నేతృత్వంలో అజ్ఞాత దళ సభ్యుల కుటుంబ సభ్యులు, మావోయిస్టు పార్టీని వీడిన దళ సభ్యులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి ఓఎస్‌డీ (ఆపరేషన్స్) పరితోజ్ పంకజ్, భద్రాచలం ఏఎస్‌పీ విక్రాంత్‌కుమార్‌సింగ్‌తో కలిసి ఆయన ముఖ్య అతిథి గా హాజరై మాట్లాడారు. మావోయిస్టు పార్టీ కాలం చెల్లిన సిద్ధాంతాలతో అమాయకులైన ఆదివాసీల జీవితాలతో ఆడుకుంటోదని, అమాయకులైనవారిని పార్టీలో చేర్చుకొని, వారి భవిష్యత్‌ను నాశనం చేస్తోందన్నారు. ఆదివాసీలను మోసం చేస్తున్న మావోయిస్టులు ఏ గ్రామానికై నా రోడ్డు వేశారా? తాగునీటి సౌకర్యం కల్పించారా? వైద్య సదుపాయం కల్పించారా? అని ప్రశ్నించారు. ఏడాది కాలంలో 36 మంది మావోయిస్టులు లొంగిపోయారని, వారందరికీ ప్రభుత్వం తరఫున పునరావాసం కల్పించామని తెలిపారు. పది, ఇంటర్, డిగ్రీ, నర్సింగ్, బీటెక్ వంటి ఉన్నత చదువులు చదివి ఉపాధి లేకుండా ఉన్న వారికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని, అలాంటి వారు ఎవరైనా ఉంటే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో గానీ, భద్రాచలంలోని ఏఎస్‌పీ కార్యాలయంలో గానీ లేదా నేరుగా తనను గానీ కలిస్తే ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో చెన్నాపురం, పూసుగుప్ప గ్రామాల్లో సుమారు రూ.2 కోట్లతో వైద్యశాలలను నిర్మించామని, త్వరలోనే అన్ని రకాల పరీక్షలకు సంబంధించిన మిషనరీతో పాటు ఎంబీబీఎస్ స్థాయి వైద్యులను నియమించి 24 గంటలూ వైద్య సేవలు అందించడంతో పాటు అంబులెన్సులను కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ సంద ర్భంగా చర్ల మండలంలోని ఎర్రంపాడు, రాళ్లాపురం, బట్టిగూడెం గ్రామాలకు చెందిన నలుగురు వ్యక్తులు మావోయిస్టు పార్టీలో పని చేస్తుండగా వారి తల్లిదండ్రులకు నిత్యావసర సరుకులు, దుప్పట్లు అందజేశారు.
22 మంది లొంగుబాటు..
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్, సుకుమా జిల్లాలోని ఎర్రపల్లి, సాకిలేరు, జబ్బగట్ట, దూలేడు తదితర గ్రామాలకు చెందిన ఐదుగురు గ్రామ కమిటీ (ఆర్‌పీసీ) సభ్యులు, నలుగురు డీఏకేఎంఎస్ సభ్యులు, 11 మంది మిలీషియా కమిటీ సభ్యులు, ఒక కేఎంఎస్, సభ్యుడు, ఒక సీఎన్‌ఎం సభ్యుడు మొత్తం 22 మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా ఎస్పీ రోహిత్‌రాజు ఎదుట లొంగిపోయారు. వీరందరికీ ప్రభుత్వం తరఫున పునరావాసం కల్పిస్తామని ఎస్పీ చెప్పారు. కార్యక్రమంలో సీఆర్‌పీఎఫ్ 141 బెటాలియన్ కమాండెంట్ రాజ్‌కుమార్, సీఐ అశోక్, ఎస్‌ఐ నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment