మాజీలతో మాటా మంతీ !
● అడవుల్లో పరిస్థితి ప్రమాదకరంగా మారింది ● లొంగిపోతామంటే సాయం చేస్తామంటున్న మాజీలు ● నిలదొక్కుకునే వరకు అండగా ఉంటామన్న పోలీసులు
‘సాక్షి’తో ముచ్చటించిన పోలీసులు, మాజీ మావోయిస్టులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సుదీర్ఘ కాల అజ్ఞాత జీవితాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులతో జిల్లా పోలీసులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లొంగిపోయిన మావోయిస్టులతోపాటు పోలీసులతోనూ సాక్షి మాట్లాడింది. నిన్నామొన్నటి వరకు అజ్ఞాత జీవితం గడిపిన ఈ మాజీ మావోలు తమ వ్యక్తిగత పేర్లు, ఫొటోలను బయటి ప్రపంచానికి వెల్లడించేందుకు ఇష్టపడలేదు. కానీ తమ అభిప్రాయాలను నిర్మోహమాటంగా పంచుకున్నారు.
లొంగిపోతామంటే సాయం చేస్తాం
అజ్ఞాతంలో ఉంటూ అనారోగ్యం బారిన పడితే వైద్య సాయం దొరకడం కష్టంగా మారుతోంది. కాలు కదపలేని స్థితిలో కూడా కిలోమీటర్ల కొద్ది నడవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అందువల్లే లొంగిపోయామని ఎక్కువ మంది చెప్పారు. మరికొందరు ‘అందరికీ సమస్యలు ఉన్నాయి, ముందు మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి అందుకే లొంగిపోయాం’ అని చెప్పారు. మళ్లీ అడవి బాట పట్టి అజ్ఞాతంలోకి వెళ్తారా అని ప్రశ్నిస్తే ‘ఇక్కడ బాగానే ఉంది. మళ్లీ లోపలికి పోవడం ఎందుకు’ అని ప్రశ్నించారు. అజ్ఞాతంలో ఉన్న మీ స్నేహితులు ఎలా ఉన్నారని ప్రశ్నిస్తే ‘వారు ఒకప్పుడు మా స్నేహితులు ఇప్పుడు కాదు’ అని బదులిచ్చారు. అజ్ఞాతంలో ఉన్న వారిని లొంగిపొమ్మని కోరతారా అన్ని ప్రశ్నిస్తే ‘అడవుల్లో బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడయితే పరిస్థితి బాగాలేదు. మనం చెబితే వాళ్లు వినరు. కానీ లొంగిపోవాలని అనుకునే వాళ్లకు సాయం చేస్తాం’ అని చెప్పారు.
నిలదొక్కుకునే వరకు..
లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం అందించే సాయం బాగుందా అని ప్రశ్నించగా ‘దళంలో ఉన్నప్పుడు పెద్దగా ఖర్చులు ఉండవు, ప్రధాన అవసరాలు అన్నీ పార్టీనే చూసుకుంటుంది. మా కుటుంబాల గురించి పెద్దగా ఆలోచించం. కానీ లొంగిపోయిన తర్వాత అన్నీ మొదటి నుంచి చేసుకుంటూ రావాలి. పునరావాసం కింద అందే ఆర్థిక సాయం కొద్ది మంది వృథా చేస్తున్న మాట వాస్తవమే. కానీ, చాలా మందికి ఇళ్లు కట్టుకోవడం, కొన్ని సామాన్లు కొనడం వంటి పనులతోనే ఆ డబ్బులు అయిపోతున్నాయి. ఆ తర్వాత వ్యవసాయం చేసుకోవడానికి బోర్లు, కరెంటు, ట్రాక్టర్లు వంటి ఆధునిక సౌకర్యాలకు డబ్బులు ఉండటం లేదు. లొంగిపోయిన మావోయిస్టులు తమ వ్యక్తిగత/కుటుంబపరమైన జీవితంలో నిలదొక్కుకునే వరకు ప్రభుత్వం అండగా నిలబడితే బాగుంటుంది’ అని చెప్పుకొచ్చారు.
పదిహేనేళ్లయింది
నా కూతురు పేరు ఇడిమే. అజ్ఞాతంలోకి వెళ్లి పదిహేనేళ్లు అయ్యింది. మధ్యలో ఎప్పుడూ ఇంటికి రాలేదు. ఆమెను కలిసేందుకు ప్రయత్నించినా వీలుకాలేదు. ఈ మధ్య ఎన్‌కౌంటర్ల వార్తలు విన్నప్పుడల్లా భయమేస్తోంది. ఒక్కసారైనా నా బిడ్డను చూసుకోవాలని ఉంది. ఆమె లొంగిపోతే బాగుండు. అడవిలోనే బాగానే ఉంటుందనే నమ్మకంతోనే బతుకుతున్న.
– కనుము మైసయ్య
కలిసి పని చేద్దాం రండి
అజ్ఞాతంలో ఉన్న దామోదర్, ఆజాద్, వెంకటేశ్, చంద్రన్న, సుధాకర్ తదితర తెలంగాణకు చెందిన మావోయిస్టు నేతలు అందరూ లొంగిపోవాలి. ఇన్నాళ్లు అడవుల్లో ఉండి మీరు చేసిన అభివృద్ధి ఏమీ లేదు. మీ చర్యలు అభివృద్ధికి అడ్డంకిగా ఉన్నాయి. జనజీవన స్రవంతిలోకి రండి. సొసైటీ డెవలప్‌మెంట్ కోసం కలిసి పని చేద్దాం.
–బి. రోహిత్‌రాజు, ఎస్పీ
దేశంలో బెస్ట్ ప్యాకేజీ ఇదే
సరెండర్ ప్యాకేజీ గురించి పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడుతూ... ‘లొంగిపోయిన వారం నుంచి పది రోజుల్లోపు నగదు రివార్డును బ్యాంకు ఖాతాలు తెరిచి చెక్కుల రూపంలో అందిస్తున్నాం. సరెండర్ మావోలు జీవితంలో నిలదొక్కుకునే వరకు అండగా నిలబడేందుకు ప్రయత్నిస్తున్నాం. తర్వాత కాలంలో ఇబ్బందులకు గురి కాకుండా జాగ్రత్త పడుతున్నాం. వారి జీవనశైలి మార్చే బాధ్యత మాది అనుకుంటున్నాం. అందువల్లే గడిచిన మూడేళ్ల కాలంలో ఈ జిల్లా నుంచి అజ్ఞాతంలో 36 మంది మావోయిస్టులు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య ఆరుకు పడిపోయింది. తెలంగాణ అందించే లొంగుబాటు ప్యాకేజీ ఆ తర్వాత మద్దతు బాగుండటం వల్లనే ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారు కూడా ఇక్కడ లొంగిపోయేందుకు ముందుకు వస్తున్నారు. దేశంలో తెలంగాణ సరెండర్ ప్యాకేజీనే బాగుంది’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment