వేదికపై కలెక్టర్ అనుదీప్ దంపతులు
భద్రాద్రి(కొత్తగూడెం): అందరి సహకారంతో జిల్లాను అభివృద్ధి వైపు పయనింపజేయగలిగామని బదిలీపై వెళ్తున్న కలెక్టర్ అనుదీప్ అన్నారు. జిల్లా ప్రజల ప్రేమాభిమానాలు మరువలేనివన్నారు. ఎన్నో మధురమైన జ్ఞాపకాలు, అనుభూతులతో ఇక్కడి నుంచి వెళుతున్నానని చెప్పారు. అనుదీప్ బదిలీ అయిన సందర్భంగా ఐడీఓసీలో సోమవారం ఆత్మీయ వీడ్కోలు సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019లో తనకు శిక్షణా కలెక్టర్‌గా జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారని, భద్రాద్రి కొత్తగూడెం అంటే చాలా దూరమని మొదట అనుకున్నానని, కానీ జిల్లా ఇంతగా ఆదరిస్తుందని అనుకోలేదని అన్నారు.
తనకంటే ముందు కలెక్టర్లు రజత్‌కుమార్ శైనీ, ఎంవీ రెడ్డి వద్ద పనిచేయడంతో ఎన్నో నేర్చుకున్నానని తెలిపారు. క్లిష్టమైన పరిస్థితుల్లో అదనపు కలెక్టర్ సలహాలు, సూచనలు ఉపయోగపడ్డాయని చెప్పారు. పోడు సమస్య పరిష్కారంలో ఐటీడీఏ పీఓ, డీఎఫ్‌ఓల సహకారం మరువలేనిదన్నారు. ఎస్పీలు సునీల్‌దత్, వినీత్ కూడా ఎంతగానో సహకరించారని, విధుల నిర్వహణలో సిబ్బంది సైతం అద్భుతంగా పనిచేశారని అభినందించారు. ముఖ్యంగా గోదావరి వరదల సమయంలో ప్రతి ఒక్కరూ ఎంతగానో కష్టపడ్డారని అన్నారు.
తన బాధ్యతల్లో సతీమణి సైతం ఓ స్నేహితురాలిగా సహకారం అందించారని, తన కుమారుడు మన్యం బిడ్డేనని చెప్పారు. తల్లిదండ్రులు నేర్పిన సిద్ధాంతాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు. భద్రాద్రి రాముడితో పాటు పరిపాలనా ఓనమాలు నేర్పిన జిల్లాకు ఎప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు. అనంతరం పలువురు అధికారులు మాట్లాడుతూ.. జాతీయ ర్యాంకర్‌గా ఖ్యాతిని ఆర్జించడమే కాదు.. మొదటి సారి సొంత రాష్ట్రంలో, అదీ ఆదివాసీ జిల్లా అయిన భద్రాద్రిలో మొదటి పోస్టింగ్ సాధించిన అనుదీప్ భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాఽధిస్తారని అన్నారు.
ఇప్పుడు రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ జిల్లాకు కలెక్టర్‌గా వెళుతున్నారని, ముందు ముందు దేశ రాజధాని ఢిల్లీలో కూడా సత్తా చాటడం ఖాయమని చెప్పారు. అనంతరం కలెక్టర్ అనుదీప్‌ను పలువురు ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి డీఆర్‌ఓ అశోకచక్రవర్తి అధ్యక్షత వహించగా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment