కలెక్టర్‌గా ప్రియాంక | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌గా ప్రియాంక

Published Sat, Jul 15 2023 12:22 AM | Last Updated on Sat, Jul 15 2023 1:14 PM

- - Sakshi

భద్రాచలం/సూపర్‌బజార్‌ (కొత్తగూడెం): ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది. దీంతో జిల్లా నూతన కలెక్టర్‌గా 2016 బ్యాచ్‌కు చెందిన ప్రియాంక ఆల నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆమె గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో అడిషనల్‌ కమిషనర్‌గా పని చేస్తున్నారు. 2021లో జరిగిన గ్రేటర్‌ ఎన్నికలను సమర్థంగా నిర్వహించిన అధికారిగా ఆమె పేరు తెచ్చుకున్నారు.

అంతకుముందు ఆమె యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రత్యే క అధికారిగా పనిచేశారు. కలెక్టర్‌తోపాటు భద్రాచలం –ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా ఉన్న గౌతమ్‌ పొట్రు సైతం బదిలీ అయ్యారు. సెర్ప్‌ సీఈఓగా గౌతమ్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం ఆయన స్థానంలో రంగారెడ్డి జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌గా ఉన్న ప్రతీక్‌ జైన్‌ను నియమించింది. ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది.

ట్రైనీగా మొదలుపెట్టి..

సివిల్స్‌ పరీక్షల్లో జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు సాఽధించిన దురిశెట్టి అనుదీప్‌ జిల్లాలో ట్రైనీ కలెక్టర్‌గా తొలిసారి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత ఇక్కడే స్థానిక సంస్థలకు అడిషనల్‌ కలెక్టర్‌గా పదోన్నతి పొందారు. ఈ రెండు పోస్టుల్లో జిల్లా అంతటా ఆయన విస్త్రృతంగా పర్యటించారు. అశ్వారావుపేట దగ్గర కొండరెడ్లపై ప్రత్యేకంగా పరిశోధన చేశారు. వారి జీవిత స్థితిగతులను దగ్గరుండి పరిశీలించారు.

ఆ తర్వాత జిల్లా కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. గతేడాది రికార్డు స్థాయిలో వరదలు వచ్చినప్పుడు కలెక్టర్‌ హోదాలో అనుదీప్‌ చేసిన కృషికి సర్వత్రా ప్రశంసలు దక్కాయి. డైబ్బె అడుగులకు పైగా గోదావరి వరద వచ్చినా ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ సహాయక కార్యక్రమాలు చేపట్టారు. వీటితోపాటు గతేడాది డిసెంబరులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనను విజయవంతం చేశారు. రాష్ట్ర గవర్నర్‌, సీఎంలు ఒకేసారి జిల్లాలో పర్యటించినా ప్రోటోకాల్‌ సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

పోడు పట్టాలు..
గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న భద్రాద్రి జిల్లాలో పోడు రైతులకు పట్టాలను అతి తక్కువ సమయంలో అందివ్వడంలో కలెక్టర్‌గా అనుదీప్‌ ఎంతో శ్రమించారు. సుమారు లక్షన్నర వరకు వచ్చిన దరఖాస్తులను వడబోసి కేవలం రెండున్నర నెలల సమయంలో లక్షన్నర ఎకరాలకు సంబంధించి యాభై ఐదు వేల పట్టాలను తయారు చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేశారు. అదనపు గంటలు పని చేశారు. ఎంతో జఠిలంగా మారిన పోడు పట్టాల పంపిణీని ప్రజల నుంచి పెద్దగా వ్యతిరేకత రాకుండానే విజయవంతంగా పూర్తి చేయగలిగారనే భావన ప్రజల్లో నెలకొంది.

మారుమూల గిరిజన ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలను మెరుగుపరచడంలోనూ తనదైన ముద్ర వేశారు. అశ్వారావుపేట, ఇల్లెందు, చర్ల, మణుగూరు వైద్యశాలలను ఆధునీకరించటంతోపాటు వైద్యులను నియమించి వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా చర్ల, అశ్వారావుపేట ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగు పరచడానికి వ్యక్తిగతంగా కూడా చొరవ చూపించారు. ఆయన కలెక్టర్‌గా ఉన్న సమయంలో జిల్లాకు స్వచ్ఛ సర్వేక్షణ్‌, ఆరోగ్య పంచాయతీ, జలసంరక్షణ విభాగంలో జాతీయ అవార్డులు వరించాయి.

సెర్ప్‌ సీఈఓగా గౌతమ్‌ పొట్రు
భద్రాచలం ఐటీడీఏ పీఓగా పనిచేస్తున్న గౌతమ్‌ పొట్రు సెర్ప్‌ సీఈఓగా బదిలీ అయ్యారు. 2020, ఆగస్టు 7న పీఓగా గౌతమ్‌ బాధ్యతలు స్వీకరించారు. గిరిజనాభివృద్ధికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించటంలో కృషి చేశారు. కాగా గిరిజన దర్బారులో అందుబాటులో లేకపోవడం, గిరిజన గ్రామాల్లో క్షేత్ర స్థాయి పర్యటనలు లోపించటం వంటి అపవాదులను ఆయన మూటగట్టుకున్నారు.

కల్లూరు ఆర్‌డీఓగా శివాజీ
స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ (భూసేకరణ)గా ఉన్న శివాజీని కల్లూరు ఆర్డీఓగా బదిలీ చేశారు. గతంలో ఆయన భద్రాచలం ఆలయ ఈఓగా పని చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement