కొత్తగూడెంఅర్బన్: భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్ నుంచి విజయవాడ వరకు రాకపోకలు సాగించే విజయవాడ ఎక్స్‌ప్రెస్ రైలు శనివారం నుంచి పునఃప్రారంభమైంది. గత మే నెలలో రైల్వే లైన్ మరమ్మతుల కారణంగా విజయవాడ రైలును తాత్కాలికంగా రద్దు చేశారు. మరమ్మతులు పూర్తి కావడంతో తిరిగి ప్రారంభించారు. కొత్తగూడెం నుంచి రోజూ మధ్యాహ్నం 1.45 గంటలకు బయలుదేరి విజయవాడకు వెళ్లనుంది. విజయవాడ వెళ్లే ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.
ఘనంగా బాలాజీ కల్యాణం
అన్నపురెడ్డిపల్లి: మండల కేంద్రంలోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ బాలాజీ వెంకటేశ్వరస్వామి వారి కల్యాణాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆలయంలో స్వామివారి కి అర్చనలు, ప్రత్యేక పూజలు చేసి పంచామృతంతో అభిషేకంజరిపారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు ప్రసాదాచార్యులు స్వామి వారి కల్యాణాన్ని వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం భక్తులకు స్వామి వారి తీర్థప్రసాదాలను అందించారు.
అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలను పరిష్కరించాలని డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి హరికృష్ణ డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ధర్నాచౌక్‌లో సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు చేపట్టిన రిలే దీక్షలు శనివారం ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. దీక్షలకు ఆయన మద్దతు తెలిపి మాట్లాడారు. రిటైర్మెంట్ బెన్‌ఫిట్స్ విషయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి జి.పద్మ, నాయకులు ఎం.విజయశీల, కృష్ణవేణి, లక్ష్మి, ఆర్‌కెఎం లక్ష్మి, శాంతమ్మ, దేవులి, ఎల్లమ్మ, భాగ్యమ్మ, సాయమ్మ, అనసూర్య తదితరులు పాల్గొన్నారు.
జనరల్ మజ్దూర్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కొత్తగూడెం రీజియన్ పరిధిలోని మణుగూరు ఏరియాలోని భూగర్భ గనిలో పనిచేసేందుకు సంస్థవ్యాప్తంగా జనరల్ మజ్దూర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ శనివారం జీఎం పర్సనల్ (ఐఆర్‌పీఎం) బీఆర్ దీక్షితులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులను అన్ని ఏరియాలకు పంపించారు. సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటామని, విజిలెన్స్ కేసులో ఉన్నవారి దరఖాస్తులను పరిశీలనలోకి తీసుకోబోమని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
శ్రీ వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారి పాదానికి, శ్రీస్వామి వారి విగ్రహానికి అర్చకులు వేదమంత్రాలు, పంచామృతాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత శ్రీస్వామి వారిని, శ్రీఅలివేలు మంగ ,శ్రీపద్మావతి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించడంతో పాటు శాస్త్రోక్తంగా నిత్య కల్యాణం నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు శ్రీవారిని దర్శించుకుని పూజలు చేశరు. అర్చకులు, భక్తులు శ్రీస్వామి, , అమ్మవార్లకు పల్లకీ సేవ చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ జగన్మోహన్‌రావు, చైర్మన్ శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సూపరింటెండెంట్ విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment