భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణవ్యాప్తంగా వర్షాలు దండికొడుతున్నాయి. భారీ వర్షాలు కురవడంతో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఇక, తాజాగా భద్రాద్రి జిల్లాలో పెద్దవాగు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో నీటిలో 30 మంది కూలీలు చిక్కుకున్నారు. వారిని హెలికాప్టర్ సాయంతో రక్షించారు.
కాగా, భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలోని పెద్దవాగు ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం అధికారులు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తారు. దీంతో ప్రాజెక్టు దిగువ భాగంలో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగిపోయింది. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెంలోని నారాయణపురం వద్ద 30 మంది కూలీలు వరదలో చిక్కుకున్నారు.
వారంతా సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. వారి కుటుంబ సభ్యులకు ఫోన్‌లో ఈ విషయం చెప్పడంతో అధికారులు రంగంలోకి దిగారు. బాధితులను రక్షించేందుకు సీఎంవోతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంప్రదింపులు జరిపారు. హెలికాప్టర్ ద్వారా బాధితుల్ని రక్షించాలని ఆదేశించారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందం, రెస్క్యూ టీమ్ సహాయ చర్యలు చేపట్టాలని సూచించారు. దీంతో, ఘటన స్థలానికి హెలికాప్టర్ చేరుకుని వారిని రక్షించారు.
మరోవైపు.. పెద్దవాగు వరద ఉధృతిపై ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్, ఎస్పీలకు ఆయన ఫోన్ చేశారు. ప్రజలకు ఎలాంటి నష్టం జరుగకుండా చూడాలని వారికి ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment